యువీకి వీరాభిమానిని: మాజీ చీఫ్ సెలక్టర్
దుబాయ్: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ మద్దతుగా నిలిచారు. భారత క్రికెట్ జట్టులో యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్ ఉండటం దేవుడిచ్చిన వరంగా సందీప్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ యువీకి తానొక వీరాభిమానిగా ఉన్నానంటూ స్పష్టం చేసిన సందీప్ పాటిల్.. ఇకపై కూడా అతనికే వీరాభిమానిగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే వరల్డ్ కప్ కు యువరాజ్ సింగ్ జట్టులో ఉంటారా? అన్న ప్రశ్నకు సందీప్ సమాధాన్ని దాటవేశారు. ఆ సమయానికి ఎవరు జట్టులో ఉంటారనేది వారి ఫిట్నెస్పై ఆధారపడి వుంటుందన్నారు. కాగా, యువీకి తిరిగి భారత జట్టులోకి వచ్చే సత్తా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. యువరాజ్ మళ్లీ జట్టులో చోటు సంపాదిస్తాడనే ఆశాభావాన్ని సందీప్ వ్యక్తం చేశారు. 2019కి చాలా సమయం ఉన్నందున యువరాజ్ చోటుపై తానేమీ స్పష్టత ఇవ్వలేనన్నారు. అదే సమయంలో టీమిండియా సెలక్టర్ గా తాను లేననే విషయం గుర్తు పెట్టుకోవాలని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.