ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ముంబై: వందకు పైగా పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డేలు, ట్వంటీ 20లు కలిపి) ఆడినా తనకు చిరకాలవాంఛ మాత్రం అలాడే ఉండిపోయిందంటూ ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బాట్స్ మన్ ఆరోన్ ఫించ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఆసీస్ ఆటగాడు డేవిడ్ హస్సీ గతే తనకు పడుతుందేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హస్సీ 108 మ్యాచులు (వన్డేలు, ట్వంటీ 20లు కలిపి) ఆడినా టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేకపోయాడు. మరోవైపు ఫించ్ ఇప్పటివరకూ 79 వన్డేలు, 28 ట్వంటీ20 మ్యాచ్ లలో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికీ తనకు టెస్టుల్లో బ్యాగీ గ్రీన్ క్యాప్ ధరించే అవకాశం రాలేదని నిరాశ చెందుతున్నాడు. ఆటతీరు ఎంత మెరుగైనా, పరుగులతో రాణిస్తున్నా అవకాశం దక్కడం లేదంటున్నాడు.
కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ కే తన టాలెంట్ పరిమితం కావడంతో తాను ఏమాత్రం హ్యాపీగా లేనని స్పష్టంచేశాడు ఫించ్. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 23న పుణేలో ప్రారంభమవుతోంది. ఇందులోనూ అతడు ఎంపిక కాలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో గత మూడేళ్లలో 54.53 సగటుతో దూసుకుపోతున్నాడు ఫించ్. అయితే ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి సగటు 27.47గా ఉంది. విక్టోరియా జట్టు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ ఛాన్స్ రావడంతో ఆటతీరు ఎంతో మెరుగైంది. ఆసీస్ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి నాలుగేళ్లు గడిచినా టెస్టుల్లో మాత్రం ఇంకా తనకు ఛాన్స్ రాలేదని దిగులు చెందుతున్నాడు.