'భువనేశ్వరి లేకుంటే నాకు జీవితమే లేదు' | I would not have survived jail if not for my wife, says Sreesanth | Sakshi
Sakshi News home page

'భువనేశ్వరి లేకుంటే నాకు జీవితమే లేదు'

Published Mon, Aug 3 2015 11:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

'భువనేశ్వరి లేకుంటే నాకు జీవితమే లేదు'

'భువనేశ్వరి లేకుంటే నాకు జీవితమే లేదు'

హైదరాబాద్: టీమిండియా తరపున మళ్లీ ఆడాలనుందని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తెలిపాడు. తన భార్య, కుమార్తె స్టాండ్స్ లో కూర్చుని తన ఆట చూస్తూ కేరింతలు కొడుతున్నట్టు ఊహించుకుంటున్నానని చెప్పాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడడంతో మళ్లీ బరిలోకి దిగుతానని అతడు ప్రకటించాడు. తన భార్య సహకారంతోనే సమస్యల నుంచి బయటపడ్డానని శ్రీశాంత్ వెల్లడించాడు.

తన భార్య భువనేశ్వరి కుమారితో కలిసి ఓ ఆంగ్ల దినపత్రికకు శ్రీశాంత్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మొదట పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ భువనేశ్వరితో ప్రేమలో పడిన తర్వాత తన నిర్ణయం మార్చుకున్నానని తెలిపాడు. తమది 1942 తరహా ప్రేమకథ అని చమత్కరించాడు.

భువనేశ్వరి లేకుండా తన జీవితం ఊహించుకోలేకపోతున్నానని చెప్పాడు. ప్రపంచమంతా వ్యతిరేకించినా తనను పెళ్లాడిందని గుర్తు చేసుకున్నాడు. రాజస్థాన్ రాజకుటుంబం నుంచి వచ్చినా ఆమెలో గర్వం ఇసుమంతైనా లేదన్నాడు. ఆమె లేకుంటే జైల్లో తాను జీవించివుండే వాడిని కాదని అన్నాడు. తాను జైల్లో ఉన్నప్పుడు తన భార్య రోజూ కిచెన్ లో పడుకునేదన్న విషయం తెలిసి ఆమెపై గౌరవం మరింత పెరిగిందన్నాడు. తనకు క్రికెట్ గురించి అస్సలు తెలియదని చెప్పాడు.

తన భర్త జైల్లో ఉన్నప్పుడు చూడటానికి వెళ్లలేదని భువనేశ్వరి వెల్లడించారు. తనను చూసేందుకు జైలుకు రావొద్దని శ్రీశాంత్ చెప్పాడని, అందుకే వెళ్లలేదన్నారు. శ్రీశాంత్ ఎటువంటి  తప్పు చేయడన్న తన నమ్మకం కోర్టు తీర్పుతో రుజువైందన్నారు. శ్రీశాంత్ చాలా మంచివాడని, అతడిలో ఆవేశాన్ని మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహిణిగా తన భర్త, కుమార్తె బాగోగులు చూసుకోవడమే తన కర్తవ్యమని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement