ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? | ICC announced World Cup 2019 Winners To Get Record Prize Money | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

Published Fri, May 17 2019 7:09 PM | Last Updated on Thu, May 30 2019 2:12 PM

ICC announced World Cup 2019 Winners To Get Record Prize Money - Sakshi

లండన్‌‌: ఇంగ్లండ్‌-వేల్స్‌ వేదికగా మే 30 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ 2019 కు సర్వం సిద్దమైంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ ముగియడంతో కొందరు ఆటగాళ్లు కుటుంబంతో సమయం గడుపుతుండగా మరికొందు ప్రపంచకప్‌ కోసం నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సారి ప్రపంచకప్‌లో టీమిండియా హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే స్వదేశంలో జరగనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లను తక్కువ అంచనావేయలేని పరిస్థితి 

ఇదిలా ఉండగా ఈసారి కప్‌ అందుకోబోయే జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు అత్యధికంగా నాలుగు మిలియన్‌ డాలర్ల నగదు బహుమతి లభించనుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.28 కోట్లకుపైగానే. అలాగే రన్నరప్‌కు రెండు మిలియన్‌ డాలర్లు(రూ.14 కోట్లకుపైగా), సెమీఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు(దాదాపు రూ.5కోట్లకుపైగా) అందుతాయి. లీగ్‌ దశలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు 40 వేల డాలర్ల చొప్పున విజేతలు గెలుచుకోనున్నారు. ఇక లీగ్‌ దశలోనే నిష్క్రమించే ప్రతీ జట్టుకు లక్ష డాలర్లు నగదు నజరానా అందనుంది.

మొత్తం 46 రోజుల సంగ్రామం మే 30 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది. 45 మ్యాచులు రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో జరగనున్నాయి. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడాలి. లీగ్‌దశ ముగిసేసరికి ఎవరైతే తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తారో వారే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. జులై 9న ఎడ్జ్‌బాస్టన్‌లోని ఓల్డ్‌ ట్రఫోర్డ్‌లో ఒక సెమీఫైనల్‌, 11న ఎడ్జ్‌బాస్టన్‌లోని బర్మింగ్‌హామ్‌లో మరో సెమీఫైనల్‌ జరుగుతుంది. ఇక చివరగా జులై 14న ప్రతిష్ఠాత్మక మైదానం లార్డ్స్‌లో తుదిపోరు ఉండనుంది. ఇంగ్లండ్‌, వేల్స్‌ సంయుక్తంగా ఇదివరకు 1975, 1979, 1983, 1999లో ప్రపంచకప్‌ వేడుకలు నిర్వహించాయి. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అక్కడ ఈ మెగా ఈవెంట్‌ జరగనుంది. అయితే ఆసీస్‌ జట్టు అత్యదికంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. వెస్టిండీస్‌, భారత్‌ రెండేసిసార్లు, పాక్‌, శ్రీలంక జట్లు చెరోసారి ఛాంపియన్లుగా నిలిచాయి. ఇక్కడ నిర్వహించిన టోర్నీల్లో వెస్టిండీస్ 1975, 1979ల్లో రెండు సార్లు, ఇండియా 1983లో, ఆస్ట్రేలియా 1999లో చెరోసారి కప్ గెలుచుకున్నాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement