
టి20 ప్రపంచకప్ విజేతకు భారీ నగదు బహుమతి
వరల్డ్ చాంపియన్‌కు 19.60 కోట్లు
దుబాయ్: వచ్చే నెలలో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. పురుషుల వరల్డ్‌కప్ విజేతతో సమానంగా... మహిళల ప్రపంచకప్ చాంపియన్‌కు నగదు బహుమతి ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయించింది. యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ నుంచే దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు ఐసీసీ మంగళవారం వెల్లడించింది. దీంతో మహిళల టి20 వరల్డ్ కప్ విజేతకు రూ. 19.60 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.
గత ప్రపంచకప్ నగదు బహుమతితో పోల్చుకుంటే... ఇది 134 శాతం ఎక్కువ కావడం విశేషం. 2023లో నిర్వహించిన మహిళల టి20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 20.52 కోట్లు (2.45 మిలియన్ అమెరికన్ డాలర్లు) కాగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ. 66.67 కోట్ల(7,958,080 అమెరికన్ డాలర్లు)కు పెంచారు. దీంతో రానున్న మెగాటోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు కూడా భారీగా నగదు బహుమతి అందుకోనున్నాయి.
‘వచ్చే నెల జరగనున్న టి20 ప్రపంచకప్ నుంచి మహిళలకూ పురుషులతో సమానంగా నగదు బహుమతి ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఇది క్రీడా చరిత్రలోనే సరికొత్త నిర్ణయం’అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదే జరిగిన పురుషుల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.20 కోట్ల నగదు బహుమతి లభించింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదిక మార్చాల్సి వచ్చింది.