వెల్లింగ్టన్:దాదాపు ఏడాది కాలంగా టెస్టు ఫార్మాట్ కు కొత్త రూపు తేవాలని యోచిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆ మేరకు కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా ఇప్పటివరకూ పరిమిత ఓవర్ల సిరీస్ లో మాత్రం చూసిన చాంపియన్ షిప్ టోర్నీలు ఇక నుంచి టెస్టుల్లో కూడా కనువిందు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించేందుకు ఐసీసీ ఆమోద వేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఏడాది కాలంగా ఐదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్ లకు ఊతమివ్వాలని స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ యోచన. అయితే దానికి ఎట్టకేలకు ముగింపు పడినట్లు తెలుస్తోంది. అందుకు సుముఖత వ్యక్తం చేసిన ఐసీసీ.. 'టెస్టు చాంపియన్' టోర్నీకి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో టెస్టు హోదా కల్గిన తొమ్మిది దేశాలు పాల్గొంటాయని పేర్కొంది. ఆక్లాండ్ లో శుక్రవారం జరిగిన సమావేశంలోనే టెస్టుల్లో కొత్త విధానానికి ఐసీసీ శ్రీకారం చుట్టినట్లు హెరాల్డ్ స్పష్టం చేసింది. కాగా, టెస్టు చాంపియన్ షిప్ నిర్వహణకు మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. 2019 లో తొలి ఎడిషన్ రూపొందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment