దుబాయ్: ఈనెల చివర్లో బంగ్లాదేశ్ లో ఆరంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ఖరారు చేసింది. టెస్టు హోదా ఉన్న 10 దేశాలే కాకుండా, మరో ఆరు సభ్య దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, ఫిజీ, కెనడా, నమీబియా, నేపాల్, స్కాట్లాండ్ కూడా ఈ టోర్నికి అర్హత సాధించాయి. అంతకుముందే ఈ ఆరు జట్లు అర్హత సాధించినా.. ఐసీసీ అధికారికంగా శుక్రవారం ఆయా జట్ల పేర్లను వెల్లడించింది.
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 14 వరకూ బంగ్లాదేశ్ లోని నాలుగు నగరాల్లో మొత్తం 8 వేదికల్లో పోటీలు జరుగనున్నాయి. స్థానిక కాలమాన ప్రకారం మ్యాచ్ లు ఉదయం గం.9.00.లకు ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ తో చిట్టాగాంగ్ లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతీ ఒక్క గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ లీగ్ కు అర్హత సాధిస్తాయి. బంగ్లాదేశ్ లో సెక్యూరిటీ పరంగా ఇబ్బందులున్నందున ఆస్ట్రేలియా ఈ టోర్నీకి దూరంగా ఉండనుంది. ఆస్ట్రేలియా స్థానంలో ఐర్లాండ్ వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్నట్లు ఐసీసీ పేర్కొంది. జనవరి 22 నుంచి 25 వరకూ వార్మప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.