
లండన్: వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ తదితర అంశాలకు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త తరహా వ్యవస్థను ఏర్పాటు చేసింది. టోర్నీలో పాల్గొంటున్న ప్రతీ జట్టుతో పాటు ఒక్కో అవినీతి నిరోధక అధికారి తోడుగా ఉంటారని ఐసీసీ ప్రకటించింది. మొత్తం 10 జట్లకుగాను పది మందిని ఇందు కోసం ఎంపిక చేసినట్లు, వార్మప్ మ్యాచ్‌ల నుంచి ఫైనల్ వరకు వారు అన్ని సమయాల్లో జట్టుతోనే ఉంటారని వెల్లడించింది.
గతంలో ఒక్కో వేదిక వద్ద ఒక్కో అవినీతి నిరోధక అధికారి ఉండేవారు. ఇప్పుడు కొత్తగా నియమిస్తున్నవారు జట్టు బస చేసే హోటల్‌లోనే ఉంటారని... క్రికెటర్ల ప్రాక్టీస్, ప్రయాణ సమయంలో కూడా జట్టుతోనే కలిసి తిరుగుతారు. టీమ్‌తోనే పాటే ఉండటం వల్ల ఆటగాళ్లకు దగ్గర కావాలని ప్రయత్నించే వారిని, సహాయక సిబ్బందితో పరిచయం పెంచుకోవాలనుకునే వారిని సునాయాసంగా గుర్తించడంతో పాటు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతీ ఒక్కరిపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.