‘సూపర్ సిక్స్’ దశకు భారత్
ఐర్లాండ్‌పై 125 పరుగులతో గెలుపు
తిరుష్ కామిని అజేయ సెంచరీ
కొలంబో: బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ మెరిపించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం. మొదట భారత్ 50 ఓవర్లలో రెండు వికెట్లకు 250 పరుగులు చేసింది. ఓపెనర్ తిరుష్ కామిని (146 బంతుల్లో 113 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేయగా... మరో ఓపెనర్ దీప్తి శర్మ (128 బంతుల్లో 89; 10 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 174 పరుగులు జోడించింది.
251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో పూనమ్ (3/30), శిఖా పాండే (2/11), ఏక్తా బిష్త్ (2/15), దేవిక వైద్య (2/11) ఆకట్టుకున్నారు. సోమవారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వేతో భారత్ ఆడుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశ ముగిశాక ఆయా గ్రూప్‌ల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుతాయి.