
ఆఫ్రిదిని ముందు పంపివుంటే..?
నెపియర్: షాహిద్ ఆఫ్రిదిని కాస్త ముందు పంపితే యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ మరింత భారీ స్కోరు చేసేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పాక్ క్రమంగా పుంజుకుని స్కోరు బోర్డును 300 పరుగులు దాటించింది. ప్రారంభంలో అహ్మద్ షెహజాద్(93), హారిస్ సొహైల్(70) అర్థ శతకాలతో భారీ స్కోరుకు బాటలు వేశారు. తర్వాత మక్సూద్(45), మిస్బా(65) వేగంగా పరుగులు జోడించడంతో స్కోరు పరుగులు పెట్టింది.
చివర్లో వచ్చిన షాహిద్ ఆఫ్రిదికి 8 బంతులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. 8 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ తో 21 పరుగులు బాదేశాడు. ఈ మ్యాచ్ లో ఆఫ్రిది 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంలో చేయితిరిగిన ఆఫ్రిదిని బ్యాటింగ్ ఇంకాస్త ముందు పంపివుంటే పాక్ స్కోరు పెరిగివుండేదన్నది సగటు క్రికెట్ అభిమాని అభిప్రాయం.