ముంబై: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనపై నెలకొన్న అనిశ్చితికి త్వరలోనే తెరపడనుంది. డిసెంబర్‌లో ధోని సేన అక్కడ పర్యటించనుంది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ నెల 19న తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ముందనుకున్నట్లు సుదీర్ఘ పర్యటన కాకుండా... పూర్తిగా కుదించిన మ్యాచ్‌లతో ఈ సిరీస్‌ను నిర్వహించనున్నట్లు తెలిసింది.
బోర్డు వర్గాల సమాచారం మేరకు రెండు టెస్టులు, మూడు వన్డేలకు బీసీసీఐ ఓకే చెప్పింది. మరో టెస్టు కోసం క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) చేసిన డిమాండ్‌ను బీసీసీఐ తోసిపుచ్చినట్లు సమాచారం. పర్యటన ఆరంభంలో వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత్‌కు వెస్టిండీస్, న్యూజిలాండ్‌లతో బిజీ షెడ్యూలు ఖరారైన నేపథ్యంలో అదనంగా మరో మ్యాచ్ చేర్చలేమని బోర్డు స్పష్టం చేసింది.
బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్, సీఎస్‌ఏ చీఫ్ క్రిస్ నెన్జానిల మధ్య ఈ మేరకు గత శనివారం చర్చలు జరిగినట్లు బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. ముందనుకున్న షెడ్యూలు ప్రకారమైతే భారత్ వచ్చే నవంబర్ నుంచి జనవరి 15 వరకు మూడు టెస్టులు, ఏడు వన్డేలు, రెండు టి20లు ఆడాలి. కానీ సీఎస్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బీసీసీఐకి గిట్టని లోర్గాట్‌ను నియమించడంతో వివాదం మొదలైంది.
డిసెంబర్‌లో సఫారీ పర్యటన!
Published Wed, Oct 16 2013 1:27 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement