
ఒక్క రోజు... భారత నంబర్‌వన్‌గా...
• హరికృష్ణ అరుదైన ఘనత
• 30 ఏళ్ల తర్వాత రెండో స్థానానికి ఆనంద్
మాస్కో: మూడు దశాబ్దాలుగా భారత నంబర్‌వన్ చెస్ ప్లేయర్‌గా కొనసాగుతున్న ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు రెండో స్థానానికి పడిపోయాడు. 46 ఏళ్ల ఆనంద్‌ను తోసిరాజని... 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు తేజం పెంటేల హరికృష్ణ భారత నంబర్‌వన్ క్రీడాకారుడిగా అవతరించాడు. అయితే 29 ఏళ్ల హరికృష్ణ కేవలం మంగళవారం ఒక్కరోజు మాత్రమే భారత నంబర్‌వన్‌గా కొనసాగాడు. ప్రస్తుతం మాస్కోలో జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ సందర్భంగా ఈ ‘నంబర్‌వన్’ మార్పు చోటు చేసుకుంది.
సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో ఆనంద్ ఓడిపోవడంతో హరికృష్ణ క్లాసిక్ విభాగంలో భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా ఆవిర్భవించాడు. అయితే బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లో ఆనంద్ 30 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. 1986లో తొలిసారి భారత నంబర్‌వన్‌గా నిలిచిన ఆనంద్ ఇప్పటివరకు అదే స్థానంలో కొనసాగాడు. ఈ క్రమంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు.
మరో అవకాశం...
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఈనెల 29న ముగుస్తుంది. ఒకవేళ క్యాండిడేట్స్ టోర్నీలో ఆనంద్ పేలవ ప్రదర్శన కనబరిస్తే మాత్రం... హరికృష్ణకు మళ్లీ భారత నంబర్‌వన్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆనంద్ (2763.4 ఎలో రేటింగ్), హరికృష్ణ (2763.3 ఎలో రేటింగ్) మధ్య కేవలం .1 తేడా మాత్రమే ఉంది. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆనంద్ 13వ స్థానంలో, హరికృష్ణ 14వ స్థానంలో ఉన్నారు.