ఉప్పల్‌లో ఫుల్ ప్రాక్టీస్
నైట్‌రైడర్స్‌తో పోరుకు సన్‌రైజర్స్ రెడీ
ఉప్పల్‌లో ఇరు జట్ల సాధన
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో ఆదివారం ఉప్పల్‌లో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు రోజు రాజీవ్‌గాంధీ స్టేడియంలో హైదరాబాద్, కోల్‌కతా జట్లు సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాయి.
ఈ ఏడాది లీగ్‌లో తొలిసారి ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు అవుట్‌ఫీల్డ్‌లో, ఆ తర్వాత నెట్స్‌లో తీవ్ర సాధనలో పాల్గొన్నారు. సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను పర్యవేక్షించగా, టీమ్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫీల్డింగ్‌లో సాధన చేయించాడు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్న పర్వేజ్ రసూల్ పెద్దగా శ్రమించలేదు.
కోచ్ చెప్పిన దాని ప్రకారం ఆదివారం మ్యాచ్‌లోనూ అతను బరిలోకి దిగే అవకాశం లేదు. నైట్ రైడర్స్ ఆటగాళ్లలో గంభీర్‌తో పాటు యూసుఫ్ పఠాన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో గడిపాడు. ముఖ్యంగా సహాయ కోచ్ విజయ్ దహియా... పఠాన్ బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి సూచనలిచ్చాడు.
‘నాలుగో స్థానం కోసం ఇరు జట్లకు ఇది కీలక మ్యాచ్. కాబట్టి మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ప్రత్యర్థిని నిలువరిస్తాం. వికెట్‌ను చూస్తే భారీ స్కోరుకు అవకాశం కనిపిస్తోంది. గంభీర్ రాణించడం ఆనందంగా ఉంది. ఉతప్ప దూకుడు కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం’
- ట్రెవర్ బేలిస్, కోల్‌కతా కోచ్
‘గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో కచ్చితంగా మార్పులు ఉంటాయి. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నాం. ధావన్‌పై కెప్టెన్సీ కారణంగా ఎలాంటి ఒత్తిడి లేదు. అతను గత మ్యాచ్‌లో చాలా బాగా ఆడాడు. స్టెయిన్ ఫామ్ గురించి ఆందోళన అనవసరం. అతను వరల్డ్ నంబర్‌వన్ బౌలర్ అని మరచిపోవద్దు’
- టామ్ మూడీ, హైదరాబాద్ కోచ్