భారమంతా హనుమ, అజింక్యాలపైనే! | IND VS NZ 1St Test Day 3: India Trail By 39 Runs at Stumps | Sakshi
Sakshi News home page

భారమంతా హనుమ, అజింక్యాలపైనే!

Published Sun, Feb 23 2020 12:35 PM | Last Updated on Sun, Feb 23 2020 12:48 PM

IND VS NZ 1St Test Day 3: India Trail By 39 Runs at Stumps - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టును టీమిండియా గెలుచుకోవాలన్నా, కనీసం డ్రా చేయాలన్నా ఆ భారమంతా వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే, తెలుగు కుర్రాడు హనుమ విహారిలదే. తొలి ఇన్నింగ్స్‌ లోటు 183 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంకా 39 పరుగుల వెనుకంజలో కోహ్లి సేన ఉంది. ప్రస్తుతం అజింక్యా రహానే (25 బ్యాటింగ్‌), విహారి (15 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(58) మినహా.. పృథ్వీ షా(14), పుజారా(11), కోహ్లి(19)లు ట్రెంట్‌ బౌల్ట్‌ ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో నాలుగో రోజు రహానే, విహారిలతో పాటు రిషభ్‌ పంత్‌లు బ్యాటింగ్‌పైనే టీమిండియా తొలి టెస్టు భవిత్యం ఆధారపడి ఉంది. 

బ్యాట్స్‌మెన్‌ తీరు మారలేదు..
పరువు కోసం తప్పక పోరాడాల్సిన స్థితిలో టీమిండియా టాపార్డర్‌ నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకుంది. ముందుగా ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపాటు పడిన ప్రథ్వీ షా తన వికెట్‌ పారేసుకున్నాడు. ఓ వైపు మయాంక్‌ అగర్వాల్‌ పోరాడుతుండగా.. పుజారా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. టీ విరామానికి ముందు కోహ్లి సేనకు ఓ పెద్ద షాక్‌ తగిలింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో పుజారా బౌల్డ్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.

హాప్‌ సెంచరీతో ఊపుమీదున్న మయాంక్‌ అగర్వాల్‌ టిమ్‌ సౌతీ వేసిన లెగ్‌ సైడ్‌ బంతిని వెంటాడి మరి కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మూడు ఫోర్లతో కాన్ఫిడెంట్‌గా కనిపించిన సారథి కోహ్లి.. బౌల్ట్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతిని అనవసరంగా టచ్‌ చేసి క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రహానే, విహారిలు భారీ భాగస్వామ్యం నమోదు చేయడం, పంత్‌ మెరుపులు మెరిపిస్తే తప్ప టీమిండియా గెలిచే అవకాశాలు లేవు. మరి నాలుగో రోజు టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.   

జేమిసన్‌, బౌల్ట్‌ బౌండరీల వర్షం.. 
51 పరుగుల ఆధిక్యంతో ఓవర్‌నైట్‌ స్కోర్‌ 216/5తో మూడో రోజు ఆటను ఆరంభించిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు వేసిన తొలి బంతికే వాట్లింగ్‌(14)ను ఔట్‌ చేసి టీమిండియా శిబిరంలో బుమ్రా ఆనందం నింపాడు. అనంతరం సౌతీ(6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. సౌతీని ఇషాంత్‌ బోల్తాకొట్టించాడు. ఇక ఇక్కడి నుంచి అసలు ఆట ప్రారంభమైంది. 

ఓ వైపు గ్రాండ్‌హోమ్‌ క్రీజులో నిలదొక్కుకోగా జేమీసన్‌ యథేచ్చగా బ్యాటింగ్‌ చేశాడు. బౌండరీలతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు.  కేవలం 45 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, 1 ఫోర్‌తో 44 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం గ్రాండ్‌హోమ్‌(43; 74 బంతుల్లో 5ఫోర్లు)ను కూడా అశ్విన్‌ బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ట్రెంట్‌ బౌల్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్‌ సహాయంతో 38 పరుగులు చేసి కివీస్‌కు కావాల్సిన ఆధిక్యాన్ని టీమిండియాకు జరగాల్సిన నష్టాన్ని కలిగించి ఔటయ్యాడు. దీంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ (5/68), అశ్విన్‌(3/99)లు రాణించగా.. షమీ, బుమ్రాలు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

చదవండి:
‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’
పాక్‌ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు!
ఆధిక్యం 51 నుంచి 183కు..
​​​​​​​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement