ఇందర్ జిత్ అవుట్?
న్యూఢిల్లీ: డోపింగ్లో పట్టుబడ్డ భారత షాట్ పుట్ ఆటగాడు ఇందర్ జిత్ సింగ్ .. రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాలు దాదాపు సన్నగిల్లాయి. ఇందర్ జిత్ నుంచి రెండోసారి సేకరించిన శాంపిల్స్ ఫలితాల్లో కూడా అతను విఫలమయ్యాడు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నిర్వహించిన ఇందర్ జిత్ బి'శాంపిల్ ఫలితంలో నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతని రియో అవకాశాలకు తెరపడినట్లే కనబడుతోంది.
గత నెల 22వ తేదీన ఇందర్ జిత్ కు నిర్వహించిన డోపింగ్ టెస్టులో నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. కాగా, డోపింగ్ కు తాను పాల్పడలేదని ఇందర్ జిత్ స్పష్టం చేశాడు. ఎవరో చేసిన కుట్రలో తాను బలయ్యానంటూ నాడాకు విన్నవించాడు. అయితే రెండోసారి శాంపిల్ను తీసుకుని పరీక్షించినా ఫలితం పాజిటివ్ గానే వచ్చింది. దీంతో అతని రియో భవితవ్యం ప్రశ్నార్ధకరంగా మారింది.
గతేడాది ఆసియన్ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించిన ఇందర్ జిత్ రియోకు అర్హత సాధించాడు. దీంతో రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2014లో ఇంచియాన్లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో ఇందర్ జిత్ ఆకట్టుకుని కాంస్య పతకం సాధించాడు. అయితే ఇప్పుడు ఇందర్ జిత్ డోపింగ్ లో పట్టుబడటంతో అతని పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తుంది. . ఒకవేళ డోపింగ్ ఉదంతంలో దోషిగా తేలితే మాత్రం అతని కెరీర్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.