Inderjeet Singh
-
ఇందర్ జిత్ అవుట్?
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడ్డ భారత షాట్ పుట్ ఆటగాడు ఇందర్ జిత్ సింగ్ .. రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాలు దాదాపు సన్నగిల్లాయి. ఇందర్ జిత్ నుంచి రెండోసారి సేకరించిన శాంపిల్స్ ఫలితాల్లో కూడా అతను విఫలమయ్యాడు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నిర్వహించిన ఇందర్ జిత్ బి'శాంపిల్ ఫలితంలో నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతని రియో అవకాశాలకు తెరపడినట్లే కనబడుతోంది. గత నెల 22వ తేదీన ఇందర్ జిత్ కు నిర్వహించిన డోపింగ్ టెస్టులో నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. కాగా, డోపింగ్ కు తాను పాల్పడలేదని ఇందర్ జిత్ స్పష్టం చేశాడు. ఎవరో చేసిన కుట్రలో తాను బలయ్యానంటూ నాడాకు విన్నవించాడు. అయితే రెండోసారి శాంపిల్‌ను తీసుకుని పరీక్షించినా ఫలితం పాజిటివ్ గానే వచ్చింది. దీంతో అతని రియో భవితవ్యం ప్రశ్నార్ధకరంగా మారింది. గతేడాది ఆసియన్ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించిన ఇందర్ జిత్ రియోకు అర్హత సాధించాడు. దీంతో రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో ఇందర్ జిత్ ఆకట్టుకుని కాంస్య పతకం సాధించాడు. అయితే ఇప్పుడు ఇందర్ జిత్ డోపింగ్ లో పట్టుబడటంతో అతని పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తుంది. . ఒకవేళ డోపింగ్ ఉదంతంలో దోషిగా తేలితే మాత్రం అతని కెరీర్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. -
భారత్‌కు మరోసారి ఎదురుదెబ్బ!
-
నన్ను కావాలనే ఇరికిస్తున్నారు!
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన ఇందర్జిత్ సింగ్ తనకు ఏపాపం తెలియదంటున్నాడు. షాట్ ఫుట్ విభాగంలో రియోలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్ ఇందర్జిత్ సింగ్ గతనెల 22న నాడా జరిపిన డోప్ టెస్టుల్లో 'ఏ' శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చింది. ఆండ్రోస్టెరాన్, ఎటికోలనోలోన్ అనే రెండు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అతడి రియో అవకాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎవరో కావాలని తనపై కుట్రపన్నారని, తాను ఇచ్చిన శాంపిల్స్ లో ఏదో తేడా జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశాడు. తనపై దుష్రచారం చేసి తన నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయాడు. ప్రస్తుతం తాను ఈ విషయంపై మాట్లాడేస్థితిలో లేనని, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే వాళ్లు ఎలాంటి ఉత్ప్రేరకాలను తీసుకోరని షాట్ ఫుటర్ చెప్పాడు. తనను ఉద్దేశపూర్వకంగా డోపింగ్ వివాదంలో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించాడు. గతేడాది 50 సార్లు డోప్ టెస్టుల్లో పాల్గొన్నాను, ఈ ఏడాది కూడా అడిగిన ప్రతిసారి శాంపిల్స్ ఇచ్చానని ఇందర్జిత్ తెలిపాడు. అతడు 'బి' శాంపిల్స్ టెస్టు చేయించుకుని డోపింగ్ వివాదం బయటపడాల్సి ఉంటుంది. అయితే 'బి' శాంపిల్స్ లోనూ పాజిటివ్ వస్తే అతడిపై నిషేధంతో పాటు రియోకు వెళ్లకుంటా వేటు పడుతుంది. -
భారత్‌కు మరోసారి ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా డోప్ టెస్టుల్లో దొరికిపోవడం రియో పతక అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. రియోలో పాల్గొననున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన కొన్ని రోజుల్లోనే, మరో ఆటగాడు డోప్ టెస్ట్ లో విఫలమయ్యాడు. షాట్ ఫుట్ విభాగంలో రియోలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్ ఇందర్జిత్ సింగ్ గతనెల 22న నాడా జరిపిన డోప్ టెస్టుల్లో దొరికిపోయాడు. తాజాగా డోప్ టెస్ట్ ఫలితాలలో అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అతడి రియో అవకాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) ఈ విషయంపై అథ్లెటిక్ సమాఖ్యకు నేడు లేఖ రాయనుంది. ఆసియా చాంపియన్ షిప్, ఆసియా గ్రాండ్ ప్రీ, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో గతేడాది పాల్గొన్న ఇందర్జిత్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. రియోకు అర్హత సాధించిన తొలి అథ్లెట్ ఇలా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడటంతో భారత్ మరింత ఆందోళన చెందుతోంది. ఇంచియాన్ లో జరిగిన గేమ్స్ లో కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. ప్రస్తుతం అతడు అమెరికాలో శిక్షణ పొందుతున్నాడు. అథ్లెటిక్ సమాఖ్య ఇందర్జిత్ డోపీగా తేలడం విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
చరిత్ర సృష్టించిన ఇందర్జీత్
బీజింగ్: భారత అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ చేరిన తొలి భారత షాట్ పుటర్గా ఇందర్జీత్ రికార్డు నెలకొల్పాడు. ఇందర్జీత్ మూడో ప్రయత్నంలో 20.47 మీటర్లు విసిరి ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ రౌండ్లో 12 మంది అథ్లెట్లు బరిలో ఉంటారు. బీజింగ్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో 20 కిలో మీటర్ల రేస్ వాక్‌లో భారత అథ్లెట్ బల్జీందర్ సింగ్ 12వ స్థానంలో నిలిచాడు. బల్జీందర్ సింగ్ (1:21:44) టైమింగ్ నమోదు చేశాడు. -
ఇందర్జీత్కు స్వర్ణం
వుహాన్ (చైనా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్ పసిడి బోణీ చేసింది. బుధవారం జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో ఇందర్జీత్ సింగ్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. హర్యానాకు చెందిన 27 ఏళ్ల ఈ షాట్‌పుటర్ ఇనుప గుండును 20.41 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఇందర్జీత్ తాజా ప్రదర్శనతో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఎనిమిదో భారతీయ షాట్‌పుటర్‌గా నిలిచాడు. గతంలో జగ్రాజ్ సింగ్ (1973), బహదూర్ సింగ్ (1975), బల్వీందర్ సింగ్ (1985, 1989), శక్తి సింగ్ (2000), నవ్‌ప్రీత్ సింగ్ (2007), ఓంప్రకాశ్ సింగ్ (2009) ఈ ఘనత సాధించారు. తొలి రోజు జరిగిన ఇతర ఫైనల్స్‌లో మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్లో మయూఖా జానీ (6.24 మీటర్లు) ఆరో స్థానాన్ని దక్కించుకోగా... 100 మీటర్ల హర్డిల్స్‌లో గాయత్రి గోవిందరాజన్ (13.69 సెకన్లు) ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల 400 మీటర్ల విభాగంలో పూవమ్మ, లాంగ్జంపర్స్ అంకిత్ శర్మ, ప్రేమ్‌కుమార్, మహిళల 100 మీటర్ల విభాగంలో శ్రాబణి నందా ఫైనల్‌కు అర్హత పొందారు.