నన్ను కావాలనే ఇరికిస్తున్నారు!
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన ఇందర్జిత్ సింగ్ తనకు ఏపాపం తెలియదంటున్నాడు. షాట్ ఫుట్ విభాగంలో రియోలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్ ఇందర్జిత్ సింగ్ గతనెల 22న నాడా జరిపిన డోప్ టెస్టుల్లో 'ఏ' శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చింది. ఆండ్రోస్టెరాన్, ఎటికోలనోలోన్ అనే రెండు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అతడి రియో అవకాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎవరో కావాలని తనపై కుట్రపన్నారని, తాను ఇచ్చిన శాంపిల్స్ లో ఏదో తేడా జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశాడు. తనపై దుష్రచారం చేసి తన నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయాడు.
ప్రస్తుతం తాను ఈ విషయంపై మాట్లాడేస్థితిలో లేనని, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే వాళ్లు ఎలాంటి ఉత్ప్రేరకాలను తీసుకోరని షాట్ ఫుటర్ చెప్పాడు. తనను ఉద్దేశపూర్వకంగా డోపింగ్ వివాదంలో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించాడు. గతేడాది 50 సార్లు డోప్ టెస్టుల్లో పాల్గొన్నాను, ఈ ఏడాది కూడా అడిగిన ప్రతిసారి శాంపిల్స్ ఇచ్చానని ఇందర్జిత్ తెలిపాడు. అతడు 'బి' శాంపిల్స్ టెస్టు చేయించుకుని డోపింగ్ వివాదం బయటపడాల్సి ఉంటుంది. అయితే 'బి' శాంపిల్స్ లోనూ పాజిటివ్ వస్తే అతడిపై నిషేధంతో పాటు రియోకు వెళ్లకుంటా వేటు పడుతుంది.