
భారత స్టార్ రెజర్, ఒలింపిక్ విజేత బజరంగ్ పునియాకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA ) మరోసారి బిగ్ షాకిచ్చింది. బజరంగ్ పూనియాపై నాడా సస్పెన్షన్ వేటు వేసింది.
బజరంగ్ పునియా డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు నాడా ఆదివారం సస్పెండ్ చేసింది. అతడికి తాజాగా జాతీయ డోప్ కంట్రోల్ ఏజెన్సీ నోటీసు అందజేసింది.
అసలేం జరిగిందంటే?
ఈ ఏడాది మార్చిలో సోనిపట్‌లో జరిగిన ఒలింపిక్స్ ట్రయల్స్‌లో రోహిత్ కుమార్‌పై బజరంగ్ పునియా ఓడిపోయాడు. ఆ తర్వాత బజరంగ్ పూనియాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్ అతడి నమూనాలను సేకరించేందుకు ప్రయత్నించింది.
కానీ పునియా మాత్రం యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నాడా.. ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(వాడా)కు పూనియా వ్యవహరం తెలియజేసింది.
దీంతో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది.
కానీ పూనియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటకి నాడా మళ్లీ మే 7లోపు వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో గత నెలలో అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.
అయితే నాడా నోటీసులకు స్పదించని పూనియా.. నాడా క్రమశిక్షణ సంఘంకు మాత్రం తన వివరణ ఇచ్చాడు. డోపింగ్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని, పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్‌లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.
దీంతో జూన్4న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. అయితే అతడు కావాలనే డోప్ టెస్టు తప్పించుకుంటున్నాడని భావించిన నాడా మరోసారి అతడిపై నిషేదం విధించింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment