భారత్కు మరోసారి ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా డోప్ టెస్టుల్లో దొరికిపోవడం రియో పతక అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. రియోలో పాల్గొననున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన కొన్ని రోజుల్లోనే, మరో ఆటగాడు డోప్ టెస్ట్ లో విఫలమయ్యాడు. షాట్ ఫుట్ విభాగంలో రియోలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్ ఇందర్జిత్ సింగ్ గతనెల 22న నాడా జరిపిన డోప్ టెస్టుల్లో దొరికిపోయాడు. తాజాగా డోప్ టెస్ట్ ఫలితాలలో అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అతడి రియో అవకాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) ఈ విషయంపై అథ్లెటిక్ సమాఖ్యకు నేడు లేఖ రాయనుంది. ఆసియా చాంపియన్ షిప్, ఆసియా గ్రాండ్ ప్రీ, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో గతేడాది పాల్గొన్న ఇందర్జిత్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. రియోకు అర్హత సాధించిన తొలి అథ్లెట్ ఇలా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడటంతో భారత్ మరింత ఆందోళన చెందుతోంది. ఇంచియాన్ లో జరిగిన గేమ్స్ లో కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. ప్రస్తుతం అతడు అమెరికాలో శిక్షణ పొందుతున్నాడు. అథ్లెటిక్ సమాఖ్య ఇందర్జిత్ డోపీగా తేలడం విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.