
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20 పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ సాధించాలనే లక్ష్యంతో పోరుకు సమాయత్తమైన భారత్ జట్టుకు శుభారంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలై సిరీస్‌లో వెనుకబడింది. ఇది మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కావడంతో టీమిండియా బరిలో ఉండాలంటే కచ్చితంగా రెండో మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి. రేపు(శుక‍్రవారం) భారతకాలమాన ప్రకారం ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఉదయం గం.11.30ని.లకు ఆరంభం కానుంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగనున్న రేపటి మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపుపై దృష్టి సారించాయి. ఒకవైపు సిరీస్‌ను ఇక్కడ కొట్టేయాలనే కసితో కివీస్ సిద్ధమవుతుండగా, మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోకూడదనే భారత్ భావిస్తోంది.
మార్పులు తప్పవా?
తొలి టీ20లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌తో భారత్ పోరుకు సిద్ధమైనప్పటికీ కనీసం పోరాడటంలో విఫలమైంది. కివీస్ సాధించిన స్కోరును చూసి భయపడ్డారో లేక బ్యాటింగ్ విభాగం బలంగా ఉందని ఎవరికి వారే భావించారో కానీ ఓవరాల్‌గా చేతులెత్తేశారు భారత క్రికెటర్లు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు కూడా. తుది 11మందిలో 8మంది బ్యాట్స్‌మెన్ ఉండటాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. ఈ బ్యాటింగ్ లైనప్‌తో కొండంత లక్ష్యాన్నికూడా సునాయాసంగా ఛేదించవచ్చు అనుకుంటే మొత్తంగా విఫలం కావడంపై రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. దాంతో రెండో టీ20కి భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యాలను తప్పించే అవకాశాలు కనబడుతున్నాయి. వీరి స్థానాల్లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ్ కౌల్‌ను టీమిండియా మరొకసారి పరీక్షించనుంది. ఈ ముగ్గురిలో సిద్ధార్థ్ కౌల్, కుల్దీప్ యాదవ్‌లు తుది జట్టులో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సీఫెర్ట్‌కు వ్యూహ రచన చేశారా?
కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న టీమ్ సీఫెర్ట్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్‌లతో 84 పరుగులు చేసి కివీస్ భారీ స్కోరు బాటలు వేశాడు. ఈ తరుణంలో రేపటి మ్యాచ్‌కు సీఫ్టెర్ట్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపించకపోతే భారత్ మరొకసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ సిరీస్‌లో మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య సమయం తక్కువగా ఉండటంతో కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌పై భారత్ ఎంతవరకూ కసరత్తు చేసిందనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవైపు ఒత్తిడిలో భారత్ మ్యాచ్‌కు సిద్ధమవుతుండగా, ఫుల్ జోష్‌తో కివీస్ బరిలోకి దిగుతుంది. మరి టీమిండియా గెలిచి సిరీస్‌పై ఆశలు నిలుపుకుంటుందా.. లేక ముందుగానే కివీస్‌కు సిరీస్‌ను సమర్పించుకుంటుందో చూడాలి.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్, చహల్, కుల్దీప్ యాదవ్, సిద్దార్థ్ కౌల్
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టీమ్ సీఫెర్ట్, కొలిన్ మున్రో, డార్లీ మిచెల్, రాస్ టేలర్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, స్కాట్ కుగ్లేన్,టిమ్ సౌథీ, ఇష్ సోధీ, ఫెర్గూసన్
Comments
Please login to add a commentAdd a comment