టీమిండియాతో ఆ సిరీస్ అద్భుతం: పాంటింగ్
ముంబై:దాదాపు 16 సంవత్సరాల క్రితం భారత్తో స్వదేశంలో తాము ఆడిన టెస్టు సిరీస్ తన కెరీర్లోనే చిరస్మరణీయమైనదిగా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభివర్ణించాడు. 2001లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆ దైపాక్షిక టెస్టు సిరీస్ తన కెరీర్లోనే అద్భుతమైనదని పాంటింగ్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్లో తాము ఓడినప్పటికీ, క్రికెట్ ఏ స్థాయిలో ఉండాలో అదే తరహాలో ఆ సిరీస్ జరిగిందన్నాడు. అయితే ఇందులో ప్రత్యేకంగా కోల్ కతా నగరంలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన టెస్టు మ్యాచ్ మాత్రం సిరీస్కే హైలైట్ అని పాంటింగ్ తెలిపాడు.
ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తాము భారీ ఇన్నింగ్స్ చేసి భారత్ ను ఫాలో ఆన్లోకి నెట్టినా, ఆ తరువాత ఆ జట్టు పుంజుకున్న తీరు అమోఘమన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో వీవీఎస్ లక్ష్మణ్ చేసిన 280 పరుగులు, రాహుల్ ద్రవిడ్ చేసిన 180 పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయన్నాడు. ఆ తరువాత చెన్నైలో చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో టెస్టు కూడా అత్యంత ఆసక్తిని రేపిందని తన గత జ్ఞాపకాల్ని పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా మరుపురాని విజయాన్ని కైవసం చేసుకుని సిరీస్ను 2-1 తో గెలుచుకుందన్నాడు. ఈ సిరీస్లో ముంబై లో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్లతో ఆస్ట్రేలియా విజయం సాధించిన తరువాత టీమిండియా పుంజుకున్న విధానం తన క్రికెట్ కెరీర్లోనే అరుదైన సిరీస్గా పాంటింగ్ పేర్కొన్నాడు.