హర్భజనే నా శత్రువు!
సిడ్నీ:తనకు ప్రపంచ క్రికెట్ లో అసలైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగే అంటున్నాడు ఆసీస్ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్. క్రికెట్లో తనదైన ముద్రను వేసిన పాంటింగ్కు హర్భజన్ సింగ్ బౌలింగ్ అంటే భయమట. ప్రత్యేకంగా భారత్తో తలపడేటప్పుడు హర్భజన్ బౌలింగ్లో అత్యంత జాగ్రత్తగా ఉండేవాడనని, ఫీల్డ్లో అతనే తన అసలైన శత్రువని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికీ హర్భజన్ సింగ్ బౌలింగ్ లో అవుటైన క్షణాలు తనను పీడకలలా వెంటాడుతూనే ఉన్నాయన్నాడు. పాంటింగ్ తన టెస్టు కెరీర్లో హర్భజన్ బౌలింగ్ లో అత్యధికంగా 10 సార్లు అవుట్ కావడంతో ఈ దూస్రా స్పెషలిస్టును నంబర్ వన్ శత్రువుగా అభివర్ణించాడు.
దాంతో పాటు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఒక అసాధారణ టాలెంట్ ఉన్న ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ప్రస్తుతం విరాట్ వయసు పరంగా చూస్తే అతను వన్డేల్లో ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నాడన్నాడు. ప్రధానంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విరాట్ నాలుగు సెంచరీలు సాధించడం అతనిలోని విశేష ప్రతిభకు అద్దం పడుతుందని పాంటింగ్ కొనియాడాడు. ఇప్పుడు ఏదైతే విరాట్ లో ఉందో అదే టీమిండియాను ముందంజలో నిలపడానికి దోహద పడిందన్నాడు.