మా జట్టుకు కష్టాలు తప్పవు: పాంటింగ్
సిడ్నీ: వచ్చే నెల్లో భారత్లో పర్యటించే తమ క్రికెట్ జట్టుకు కష్టాలు తప్పవని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఇటీవల కాలంలో భారత్ లో పర్యటించిన పలు విదేశీ జట్లకు ఇబ్బందులు ఎదురైనట్లే, తమ జట్టు కూడా అక్కడ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. భారత్ లో పరిస్థితుల్ని అర్థం చేసుకుని అక్కడ విజయం సాధించడమంటే అంత సులభం కాదనన్నాడు.
'భారత పర్యటనలో ఆసీస్ నెగ్గుకు రావడం కష్ట సాధ్యమే. అక్కడ మేము కచ్చితంగా విపరీతంగా శ్రమించాలి. భారత్ కు అతిథిగా వెళ్లే ఏ జట్టుకైనా కష్టాలు తప్పవనేది కొంతకాలంగా మనకు కనబడుతూనే ఉంది. అదే పరిస్థితి మాకు కూడా ఎదురవుతుంది. గత కొంతకాలంగా అక్కడ వికెట్లు భారత జట్టుకు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. నేను చాలాసార్లు భారత్ పర్యటనకు వెళ్లా. తొలి రెండు రోజులు పరిస్థితి ఒక రకంగా ఉంటే, ఆ తదుపరి వికెట్ మరింత టర్న్ అవుతూ ఉంటుంది.
ఈ పరిస్థితుల్ని ఎదుర్కొని మా ఆటగాళ్లు ఎలా నిలబడతారనేది వేచి చూడక తప్పదు. ఉప ఖండంలో ఆడేటప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిని మేము ఎదుర్కొంటునే ఉన్నాం. ఇటీవల శ్రీలంకలో కూడా మాకు అదే పరిస్థితి ఎదురైంది. భారత్లో కూడా మా జట్టు ఇబ్బందికర పరిస్థితి చవి చూడక తప్పుదు' అని పాంటింగ్ తెలిపాడు.