సాక్షి, న్యూఢిల్లీ: ఆసియా కప్ హాకీ ఫైనల్‌లో మన అమ్మాయిలు దుమ్మురేపారు. పెనాల్టీ షూటౌట్‌లో ప్రత్యర్థి చైనా జట్టును 5-4 గోల్స్ తేడాతో.. భారత మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. జపాన్‌లోని కకామిగహరాలో ఆదివారం జరిగిన ఆసియా కప్ మహిళల హాకీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-చైనా జట్లు తలపడ్డాయి. ఆట ముగిసే సమయానికి ఇరుజట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలువడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు 2018 ఎఫ్‌ఐహెచ్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. చివరిసారిగా 2004లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌లో జపాన్‌పై విజయం సాధించి ఆసియా కప్‌ను సాధించింది. అంతేకాకుండా తాజా ఫైనల్‌లో డ్రాగన్ కంటీని ఓడించడం ద్వారా మొదటిరౌండ్‌లో తనకు ఎదురైన పరాజయానికి మన అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకున్నట్టైంది.
నవజ్యోత్ కౌర్ బోణీ..
భారత-చైనా మహిళా జట్లు హోరాహోరీగా తలపడటంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ ఫస్టాఫ్‌లో 25వ నిమిషం వద్ద నవజ్యోత్ కౌర్ గోల్ చేసి.. భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించారు. సెకండాఫ్ మ్యాచ్‌లో 47వ నిమిషం వద్ద టియాన్‌టియాన్ లౌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ఇరుజట్ల స్కోరు 1-1తో సమం అయ్యాయి. అనంతరం ఇరుజట్లకు గోల్స్ సాధ్యపడకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్‌లో ఐదు అవకాశాలు ఉండగా.. ఇరుజట్లు 4-4 గోల్స్‌తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో నిర్ణాయకమైన సడెన్ డేత్ కేటగిరీలో రాణి గోల్ చేయగా.. చైనా మాత్రం విఫలమైంది. దీంతో భారత జట్టుకు అద్భుతమైన విజయం వరించింది.
Comments
Please login to add a commentAdd a comment