
ఆఖరి పోరులో అదరగొట్టిన టీమిండియా
సిడ్నీ: ఎట్టకేలకు టీమిండియా గెలిచింది. అంతకుముందు మ్యాచ్ ల్లో భారీ స్కోర్లు చేసినా గెలవని టీమిండియా.. చివరిదైన ఐదో వన్డేలో మాత్రం సమష్టిగా పోరాడి విజయం సాధించింది. శనివారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో గెలిచి పరువు దక్కించుకుంది. ఆసీస్ విసిరిన 331 పరుగుల లక్ష్యాన్ని చూసి ఏమాత్రం భయపడిన టీమిండియా టోర్నీలో తొలి విజయాన్ని రుచి చూసింది. టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్(78; 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ(99; 108 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), మనీష్ పాండే(104 నాటౌట్;81 బంతుల్లో 8 ఫోర్లు,1 సిక్స్) లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
తొలుత శిఖర్ దాటిగా ఆడగా, రోహిత్ మాత్రం కుదురుగా బ్యాటింగ్ చేశాడు. అయితే హేస్టింగ్ బౌలింగ్ లో శిఖర్ మిడాఫ్ మీదుగా భారీ షాట్ కొట్టి అవుటయ్యాడు. శిఖర్ క్యాచ్ ను . గాల్లో డైవ్ కొట్టిన షాన్ మార్ష్ అధ్భుతంగా అందుకోవడంతో టీమిండియా 123 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. అనంతరం ఫస్ట్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లి(8) ఆఫ్ సైడ్ వెళుతున్న బంతిని ఆడబోయి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కేవలం 11 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఆ తరుణంలో రోహిత్-మనీష్ పాండేల జోడీ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదలించింది. జట్టు స్కోరు 231 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్ కు చేరినా, ఆ తరువాత పాండే -కెప్టెన్ మహేందర సింగ్ ధోనితో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. కాగా, చివరి ఓవర్ లో తొలి బంతిని సిక్స్ కొట్టిన ధోని(34) ఆ తరువాత బంతికి మరో షాట్ కొట్టబోయి అవుటయ్యాడు. ఆ సమయానికి టీమిండియాకు నాలుగు బంతుల్లో ఆరు పరుగులు అవసరం. అప్పుడు స్ట్రైకింగ్ ఎండ్ లోకి వచ్చిన పాండే ఎటువంటి తడబాటు లేకుండా ఆడటంతో టీమిండియా ఇంకా రెండు బంతులు ఉండగానే విజయం సాధించింది.
టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆసీస్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6)లు నిరాశపరచడంతో ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఆపై షాన్ మార్ష్(7) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న వార్నర్ ఏమాత్రం తడబాటు పడకుండా వన్డే కెరీర్ లో ఐదో సెంచరీ సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్ కూడా రాణించడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. వార్నర్(122; 113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్(102 నాటౌట్;84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు )లు శతకాలతో దుమ్మురేపడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. టీమిండియా విజయంలో ముఖ్య భూమిక పోషించిన మనీష్ పాండేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా, టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
ఆకట్టుకున్న బూమ్రాహ్
ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలో సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన బూమ్రాహ్ ఆకట్టుకున్నాడు. 10 ఓవర్ల కోటాను పూర్తి చేసిన బూమ్రాహ్ రెండు వికెట్లు తీసి 40 పరుగులిచ్చాడు. టీమిండియా బౌలింగ్ ను ఆసీస్ ఊచకోత కోసిన చోట బూమ్రాహ్ పొదుపు బౌలింగ్ చేయడం విశేషం. తొలి స్పెల్ లో ఐదు ఓవర్లలో 17 పరుగులిచ్చి స్మిత్ వికెట్ ను తొలి వికెట్ గా తన ఖాతాలో వేసుకున్న బూమ్రాహ్.. తన చివరి ఓవర్ ల్ ఫాల్కనర్ బౌల్డ్ చేశాడు.
ఈ మ్యాచ్ లో ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ 10 ఓవర్లు బౌలింగ్ వేసి 60 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ 8 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, రిషి ధవన్ 10 ఓవర్లలో 74 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లలో జడేజా 10 ఓవర్లలో 46 పరుగులివ్వగా, గుర్ కీరత్ సింగ్ రెండు ఓవర్లలో 17పరుగులిచ్చాడు.