కంగారూలను కసిగా... | India beats Australia at Cricket World Cup by 36 runs | Sakshi
Sakshi News home page

కంగారూలను కసిగా...

Published Mon, Jun 10 2019 4:52 AM | Last Updated on Mon, Jun 10 2019 8:24 AM

India beats Australia at Cricket World Cup by 36 runs  - Sakshi

సరిగ్గా మూడు నెలల క్రితం సొంతగడ్డపై భారత్‌కు ఆసీస్‌ చేతిలోనే వన్డే సిరీస్‌లో పరాభవం ఎదురైంది. 358 పరుగులు చేసి సునాయాసంగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో కూడా కంగారూలు మనకు షాకిచ్చారు. ఆ జట్టు చేతిలో వరుసగా మూడు ఓటముల తర్వాత ప్రపంచకప్‌ పోరుకు సిద్ధమైన భారత్‌ ఆ కసినంతా తీర్చుకుంది. మెగా టోర్నీ సమరంలో ఆసీస్‌ను చిత్తుగా ఓడించి విశ్వ వేదికపై మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

ఈసారి 352 పరుగులు చేసి సవాల్‌ విసిరిన కోహ్లి సేన మళ్లీ ఎలాంటి పొరపాటుకు అవకాశం ఇవ్వలేదు. తమ బౌలింగ్‌ బలగంతో ప్రత్యర్థిని కుప్పకూల్చి ఫేవరెట్‌ హోదాను మరింత పటిష్టం చేసుకుంది. ఐసీసీ టోర్నీల్లో తన అద్భుత ఆటను కొనసాగిస్తూ ధావన్‌ మరో శతకం చేయడం... కోహ్లి, రోహిత్, పాండ్యా అండగా నిలవడం భారత్‌ విజయానికి కారణమయ్యాయి.  

 లండన్‌: ప్రపంచ కప్‌లో భారత్‌ కీలక సమరంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆదివారం ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... విరాట్‌ కోహ్లి (77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (70 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (84 బంతుల్లో 56; 5 ఫోర్లు), అలెక్స్‌ క్యారీ (35 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. బుమ్రా, భువనేశ్వర్‌ చెరో 3 వికెట్లు తీశారు.   

భారీ భాగస్వామ్యం...
127, 93, 81... తొలి మూడు వికెట్లకు భారత బ్యాట్స్‌మెన్‌ నెలకొల్పిన పార్ట్‌నర్‌షిప్‌లు ఇవి. ఆరంభంలో పదునైన బౌలింగ్‌ను ఓపిగ్గా, సమర్థంగా ఎదుర్కొని ఓపెనర్లు పరుగులు సాధిస్తే, ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్‌ దూకుడు జట్టుకు భారీ స్కోరును అందించింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలో రోహిత్, ధావన్‌లను కమిన్స్, స్టార్క్‌ కట్టిపడేశారు. వీరిద్దరు వేసిన తొలి ఏడు ఓవర్లలో ఒకే ఒక బౌండరీ కొట్టిన భారత్‌ 22 పరుగులే చేయగలిగింది. 2 పరుగుల వద్ద రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను కూల్టర్‌ నైల్‌ వదిలేయడం కూడా మరో కీలక మలుపు. అయితే కూల్టర్‌ నైల్‌ వేసిన తర్వాతి ఓవర్లో ధావన్‌ మూడు ఫోర్లు బాదడంతో జోరు మొదలైంది. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్, జంపా, స్టొయినిస్‌ బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు సునాయాసంగా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ముందుగా 53 బంతుల్లో ధావన్, ఆ తర్వాత 61 బంతుల్లో రోహిత్‌ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం దాటిన తర్వాత ఎట్టకేలకు రోహిత్‌ ఔట్‌ కావడంతో ఆసీస్‌ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత మరింత వేగంగా దూసుకుపోయిన ధావన్‌ 95 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో ఎండ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి ధావన్‌ వెనుదిరిగిన తర్వాత 55 బంతుల్లో కోహ్లి హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అతని ఆటలో ముఖ్యంగా స్టార్క్‌ బౌలింగ్‌లో కొట్టిన రెండు సూపర్‌ సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. తర్వాత వచ్చిన ఎమ్మెస్‌ ధోని (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ధాటిని కొనసాగిస్తూ స్టార్క్‌ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టాడు. చివరి ఓవర్లో స్టొయినిస్‌ అద్భుత క్యాచ్‌కు ధోని, కోహ్లి ఔటైనా... రాహుల్‌ (11 నాటౌట్‌) స్కోరును 350 పరుగులు దాటించాడు. చివరి 10 ఓవర్లలో భారత్‌ 116 పరుగులు సాధించింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

రాణించిన స్మిత్‌...
దాదాపు అసాధ్యమైన విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ (35 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) తమ స్వభావానికి విరుద్ధంగా అతి నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడటంతో పరుగులు రావడమే గగనమైపోయింది. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన భువీ, బుమ్రా కలిసి తొలి 7 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చారు. అనంతరం పాండ్యా ఓవర్లో ఆసీస్‌ దూకుడు ప్రదర్శించింది. వరుస బంతుల్లో ఫించ్‌ 6, 4, 4 బాదగా, అంతకు వార్నర్‌ కొట్టిన ఫోర్‌తో ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. జాదవ్‌ చక్కటి ఫీల్డింగ్‌కు ఫించ్‌ రనౌట్‌ కావడంతో ఆసీస్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది.

వార్నర్‌ తీవ్రంగా శ్రమించి (77 బంతుల్లో) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు చహల్‌ బౌలింగ్‌లో అతని ఆట ముగిసింది. మరోవైపు స్మిత్‌ క్రీజ్‌లోకి వచ్చిన దగ్గరనుంచి చక్కటి షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. ఖాజా (39 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్‌) నుంచి అతనికి తగిన సహకారం లభించింది. ఖాజాను బుమ్రా బౌల్డ్‌ చేయగా... భువీ బంతికి స్మిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. స్టొయినిస్‌ (0), మ్యాక్స్‌వెల్‌ (14 బంతుల్లో 28; 5 ఫోర్లు) వెనుదిరగడంతో ఆసీస్‌ విజయంపై ఆశలు కోల్పోయింది. వరల్డ్‌ కప్‌లో వేగంగా అర్ధసెంచరీ చేసిన (25 బంతుల్లో) ఆసీస్‌ ఆటగాడిగా గుర్తింపు పొందిన క్యారీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.  
సున్నా నుంచి సూపర్‌గా...
ధావన్‌ 37వ ఓవర్‌ చివరి బంతికి ఔట్‌ కాగా, మిగిలిన ఓవర్లలో మరింత వేగంగా పరుగులు సాధించే లక్ష్యంతో భారత్‌ నాలుగో స్థానంలో పాండ్యాను పంపించింది. అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు. వ్యక్తిగత స్కోరు ‘0’ వద్ద కూల్టర్‌ నైల్‌ బౌలింగ్‌లో పాండ్యా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్‌ క్యారీ వదిలేసి భారత్‌కు మేలు చేశాడు. ఆ తర్వాత పాండ్యా చెలరేగిపోయాడు. మ్యాక్స్‌వెల్, జంపా బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్‌ కొట్టిన అతను కమిన్స్‌ ఓవర్లో వరుసగా 6, 4 బాదాడు. కమిన్స్‌ తర్వాతి ఓవర్లో మరో ఫోర్‌ కొట్టి అదే ఓవర్లో ఔట్‌ కావడంతో అతని మెరుపు ఇన్నింగ్స్‌ ముగిసింది.  

అలా పూర్తయింది...
ధావన్‌ కొంత ఉత్కంఠభరిత రీతిలో తన 17వ వన్డే సెంచరీని అందుకున్నాడు. స్టొయినిస్‌ బౌలింగ్‌లో 99 వద్ద సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించి అతను వెనక్కి తగ్గాడు. అప్పటికే నాన్‌స్ట్రయికర్‌ కోహ్లి చాలా ముందుకొచ్చేశాడు. ఫీల్డర్‌ విసిరిన డైరెక్ట్‌ హిట్‌ వికెట్లకు తగిలినా... డైవ్‌ చేసిన కోహ్లి బతికిపోయాడు. బంతి స్టంప్స్‌ను తాకి దూరంగా వెళ్లడంతో బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ రాబట్టారు. దీంతో ధావన్‌ శతకం పూర్తయింది. టీవీ రీప్లేలో అంతా బాగుందని తేలిన తర్వాతే ధావన్‌ సంబరాలు చేసుకున్నాడు.  

భారంగా మారిన బెయిల్స్‌!
ఒకసారి కాదు, రెండు సార్లు కాదు... ఏకంగా ఐదు సార్లు! ఈ ప్రపంచకప్‌లో బంతి స్టంప్స్‌కు తగిలి కూడా బెయిల్స్‌ కింద పడకపోవడంతో బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కాకుండా తప్పించుకున్న ఘటన మళ్లీ జరిగింది. తాజాగా భారత్‌తో మ్యాచ్‌లో వార్నర్‌ కూడా ఇలాగే బతికిపోయాడు. బుమ్రా బౌలింగ్‌లో అతని బ్యాట్‌ అంచుకు తగిలిన బంతి స్టంప్స్‌ను ముద్దాడింది. కానీ బెయిల్స్‌ మాత్రం కింద పడనంటూ మొరాయించాయి. అప్పుడు వార్నర్‌ స్కోరు 1! ప్రపంచ కప్‌లో వాడుతున్న మిరుమిట్లు గొలిపే ‘జింగ్‌ బెయిల్స్‌’ బరువుగా ఉండటమే దీనికి కారణం. ఈ టోర్నీలో ఇంతకుముందు నాలుగు సార్లు డి కాక్‌ (బౌలర్‌ రషీద్‌), కరుణరత్నే (బౌల్ట్‌), గేల్‌ (స్టార్క్‌), స్టోక్స్‌ (సైఫుద్దీన్‌) ఇలా బతికిపోయారు. ప్రపంచ కప్‌లో ఐసీసీ దీనికి ఏమైనా పరిష్కారం కనుగొంటుందేమో చూడాలి.  

ధోని గ్లవ్స్‌ మారాయి...
ధోని కీపింగ్‌ గ్లవ్స్‌కు సంబంధించి చెలరేగిన వివాదానికి ఆసీస్‌తో మ్యాచ్‌లో ముగింపు లభించింది. ఈ మ్యాచ్‌లో ధోని కీపింగ్‌ గ్లవ్స్‌ మారాయి. ఆర్మీ రెజిమెంట్‌ గుర్తు  ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ ఉన్న గ్లవ్‌లను వాడవద్దని ఐసీసీ స్పష్టంగా చెప్పడంతో అతను వాటిని పక్కన పెట్టాడు. స్పాన్సర్‌ సహా ఎలాంటి లోగో కనిపించని గ్లవ్స్‌తో అతను కీపింగ్‌ చేశాడు. 


►1 ప్రపంచ కప్‌ చరిత్రలో ఆస్ట్రేలియాపై మొదట బ్యాటింగ్‌కు దిగిన ఓ జట్టు 300కుపైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే (352/5).  

►27 ఇప్పటివరకు ప్రపంచ కప్‌లలో భారత ఆటగాళ్లు చేసిన సెంచరీల సంఖ్య. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (26 సెంచరీలు)ను వెనక్కి నెట్టి భారత్‌ టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చింది.2 ప్రపంచ కప్‌లో ఆసీస్‌పై సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌ ధావన్‌. 1999లో ఇదే ఓవల్‌ మైదానంలో అజయ్‌ జడేజా శతకం బాదాడు.

►12ప్రపంచ కప్‌లో  భారత్‌–ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లు. ఏ రెండు జట్ల మధ్య ఇంతకంటే ఎక్కువ జరగలేదు.

►2 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ తరఫున టాప్‌–3 బ్యాట్స్‌మెన్‌ 50కంటే ఎక్కువ స్కోరు చేయడం ఇది రెండోసారి. 2011లో దక్షిణాఫ్రికాపై సెహ్వగ్, సచిన్, గంభీర్‌ ఇలా చేశారు.   

►ఓవల్‌ మైదానంలో తనయుడు గౌతమ్‌తో కలిసి భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను తిలకిస్తున్న హీరో మహేశ్‌ బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement