కోహ్లి, రహానే చేతుల్లో... | India bowl out West Indies for 222 in 1st innings | Sakshi
Sakshi News home page

కోహ్లి, రహానే చేతుల్లో...

Published Sun, Aug 25 2019 4:25 AM | Last Updated on Sun, Aug 25 2019 4:25 AM

India bowl out West Indies for 222 in 1st innings - Sakshi

ఇషాంత్‌ సంబరం

మొత్తానికి ఆధిక్యమైతే దక్కింది! కానీ అది కొంతే! వెస్టిండీస్‌ మరీ ఏమీ వెనుకబడి లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థికి భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించి తొలి టెస్టులో టీమిండియాను పైమెట్టులో నిలిపే బాధ్యత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానేలపై పడింది. వీరికితోడు విహారి, పంత్‌ కొన్ని పరుగులు జోడిస్తే మిగిలిన పనిని బౌలర్లు చూసుకునే వీలుంటుంది.  

నార్త్‌ సౌండ్‌ (అంటిగ్వా): సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ (5/43) ప్రతాపం చూపాడు. కీలక సమయంలో వికెట్లు తీసి తొలి టెస్టులో వెస్టిండీస్‌ను దెబ్బకొట్టాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం విండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌ రౌండర్‌ రోస్టన్‌ చేజ్‌ (74 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్‌) ఆ జట్టు టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ హోల్డర్‌ (65 బంతుల్లో 39; 5 ఫోర్లు), హెట్‌మైర్‌ (47 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. షమీ (2/48), జడేజా (2/64)లకు రెండేసి వికెట్లు దక్కాయి. 75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌ టీ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (16), కేఎల్‌ రాహుల్‌ (85 బంతుల్లో 38; 4 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా (25) ఔటయ్యారు. కోహ్లి (14 బ్యాటింగ్‌), రహానే (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కోహ్లి సేన 173 పరుగుల ఆధిక్యంలో ఉంది.

హోల్డర్, కమిన్స్‌ విసిగించారు...  
భారత లోయరార్డర్‌లో జడేజా–ఇషాంత్‌ తరహాలోనే విండీస్‌ లోయరార్డర్‌లో హోల్డర్, మిగుయెల్‌ కమిన్స్‌ (45 బంతుల్లో 0) బౌలర్లను విసిగించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 189/8 శనివారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన కరీబియన్లు ఆలౌట్‌ కావడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ, హోల్డర్, కమిన్స్‌ పట్టుదల చూపారు. 17 ఓవర్లకు పైగా క్రీజులో నిలిచి జట్టు స్కోరును 200 దాటించారు. 9వ వికెట్‌కు 41 పరుగులు జత చేశారు. హోల్డర్‌ను ఔట్‌ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కమిన్స్‌ను జడేజా బౌల్డ్‌ చేయడంతో విండీస్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. శుక్రవారం టీ సెషన్‌ అనంతరం భారత బౌలర్ల ధాటికి         ప్రత్యర్థి తడబడింది. ప్రతి బ్యాట్స్‌మెన్‌ అన్నోఇన్నో పరుగులు చేయడంతో ఓ దశలో 130/4తో      కాస్త మెరుగ్గానే కనిపించింది. అయితే, ఇషాంత్‌ విజృంభించి... కీలకమైన చేజ్, హోప్‌ (24), హెట్‌మైర్‌ను ఔట్‌ చేశాడు. ఇదే ఊపులో రోచ్‌ (0) పెవిలియన్‌ చేర్చి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement