కుర్రాళ్ల పంతం... చేసుకోవాలి కప్ సొంతం
నేటి నుంచి జూనియర్ ప్రపంచ కప్ హాకీ
ఫేవరెట్‌గా భారత్ బరిలో 16 జట్లు
లక్నో: దశాబ్దంన్నర నిరీక్షణకు తెర దించాలని... సొంతగడ్డపై విశ్వవిజేతగా అవతరించాలని... జాతీయ క్రీడకు పునరుత్తేజం కలిగించాలనే లక్ష్యంతో... భారత యువ హాకీ జట్టు సర్వసన్నద్ధమైంది. గురువారం ఇక్కడ మొదలయ్యే జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. గ్రూప్ ‘డి’లో ఉన్న భారత్ నేడు తమ తొలి మ్యాచ్‌లో కెనడాతో తలపడుతుంది. ఆ తర్వాత 10న ఇంగ్లండ్‌తో; 12న దక్షిణాఫ్రికాతో భారత్ తమ మ్యాచ్‌లను ఆడుతుంది. 2001లో ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ కప్‌లో ఏకై క, చివరిసారి టైటిల్ నెగ్గిన భారత్ ఆ తర్వాత ఒక్కసారి కూడా టాప్-3లో నిలువలేకపోయింది.
2013లోనూ ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది.
అయితే ఈసారి మాత్రం భారత్ పకడ్బందీగా ఈ టోర్నీకి సన్నాహాలు చేసింది. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు కెప్టెన్ హర్జీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్, గోల్‌కీపర్ వికాస్ దహియాలతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో రాటుదేలిన భారత యువ జట్టు ఇటీవలే స్పెయిన్‌లో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో విజేతగా నిలిచి ప్రపంచకప్‌కు ముందు కావాల్సినంత విశ్వాసాన్ని కూడగట్టుకుంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో నాలుగు గ్రూప్‌ల్లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ పోటీలు ముగిశాక ఆయా గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారుు.
గ్రూప్‌ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కొరియా; గ్రూప్ ‘బి’: నెదర్లాండ్‌స, మలేసియా, బెల్జియం, ఈజిప్టు; గ్రూప్ ‘సి’: జర్మనీ, స్పెయిన్, న్యూజిలాండ్, జపాన్; గ్రూప్ ‘డి’: భారత్, ఇంగ్లండ్, కెనడా, దక్షిణాఫ్రికా.
భారత జట్టు: హర్జీత్ సింగ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ సింగ్, విక్రమ్‌జిత్ సింగ్, వరుణ్ కుమార్, సిమ్రన్‌జిత్ సింగ్, క్రిషన్ పాఠక్, అర్మాన్ ఖురేషీ, మన్‌దీప్ సింగ్, దిప్సాన్ టిర్కీ, పర్విందర్ సింగ్, మన్‌ప్రీత్ జూనియర్, గుర్జంత్ సింగ్, సుమిత్, సంతా సింగ్, వికాస్ దహియా, గురిందర్ సింగ్, నీలకంఠ శర్మ, అజిత్ పాండే.