వన్డేల్లో టీమిండియాదే అగ్రస్థానం!
దుబాయ్: ఇంగ్లండ్ తో జరిగిన చివరి వన్డేలో టీం ఇండియా ఓటమి చవిచూసినా అగ్రస్థానాన్నిమాత్రం నిలబెట్టుకుంది. గత వారం నంబర్ ర్యాంక్ ను ఆస్ట్రేలియా-టీం ఇండియాలు సంయుక్తంగా కైవసం చేసుకున్నా ..ట్రై-సిరీస్ లో ఆసీస్ పేలవమైన ఆటను ప్రదర్శించడంతో ఆ స్థానాన్ని కోల్పోయింది. ట్రై సిరీస్ ఫైనల్లో ఆసీస్ ను మట్టికరిపించిన దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని తృటిలో చేజార్చుకుంది. భారత్-ఇంగ్లండ్ ల ఐదు వన్డేల సిరీస్, జింబాబ్వేలో జరిగిన ట్రై సిరీస్ లు ముగిసిన అనంతరం ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించింది.
దక్షిణాఫ్రికా- భారత్ లు 113 పాయింట్లతో అగ్రస్థానం కోసం పోటీ పడగా.. స్వల్ప పాటి తేడాలో దక్షిణాఫ్రికా నంబర్ వన్ ర్యాంక్ ను చేజార్చుకుంది. ధోనీ సేన 113.49 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికా 112. 96 పాయింట్లు మాత్రమే సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం ఆసీస్ నాల్గో స్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక మూడో స్థానానికి ఎగబాకింది.