లుసానే (స్విట్జర్లాండ్): భారత్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ హాకీ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. 2023లో జరిగే పురుషుల మెగా ఈవెంట్‌ను భారత్ నిర్వహిస్తుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) శుక్రవారం వెల్లడించింది. 2023 ఆరంభంలో జనవరి 13 నుంచి 29 వరకు ప్రపంచకప్ పోటీలు జరుగుతాయని ఎఫ్‌ఐహెచ్ తెలిపింది. వేదిక ఎక్కడనేది ఆతిథ్య దేశమే ప్రకటిస్తుందని ఎఫ్‌ఐహెచ్ పేర్కొంది. బిడ్డింగ్‌లో భారత్‌తో పాటు బెల్జియం, మలేసియా దేశాలు పోటీపడ్డాయి. చివరకు భారతే ఆ అవకాశాన్ని దక్కించుకోవడంతో అత్యధికంగా నాలుగుసార్లు మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనున్న తొలి దేశంగా ఘనతకెక్కనుంది.
గతంలో 1982 (ముంబై), 2010 (న్యూఢిల్లీ), 2018 (భువనేశ్వర్)లలో ప్రపంచకప్ పోటీలు జరిగాయి. నెదర్లాండ్స్ కూడా మూడుసార్లు ఆతిథ్యమిచి్చంది. ఇక్కడ సమావేశమైన ఎఫ్‌ఐహెచ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మహిళల ప్రపంచకప్ ఆతిథ్య వేదికని ఖరారుచేసింది. ఈ ఏడాది బోర్డుకు ఇదే చివరి సమావేశం కాగా ఇందులో మహిళల ఈవెంట్ ఆతిథ్య హక్కుల్ని స్పెయిన్, నెదర్లాండ్స్‌కు సంయుక్తంగా కట్టబెట్టింది. 2022లో జూలై 1 నుంచి 22 వరకు మహిళల ఈవెంట్ జరుగుతుంది. భారత్‌కు మరోసారి మెగా ఈవెంట్ భాగ్యం దక్కడం పట్ల హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. 2023 ఏడాదితో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవనుండటంతో మరింత ఘనంగా ఈవెంట్‌ను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment