సన్నద్ధతకు మరో చాన్స్
రెండో వార్మప్‌కు భారత్ సిద్ధం
నేడు ఇంగ్లండ్‌తో పోరు
సత్తా నిరూపించుకునేదెవరు?
రాత్రి గం. 7.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
టి20 ప్రపంచకప్‌లో నేడు
గ్రూప్ ‘బి’ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు
నెదర్లాండ్స్ x జింబాబ్వే
మధ్యాహ్నం గం. 3.00 నుంచి
ఐర్లాండ్ x యూఏఈ
రాత్రి గం. 7.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
మిర్పూర్: టి20 ప్రపంచకప్ వేటను పరాజయంతో ప్రారంభించిన భారత్‌కు తమ లోపాలు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం లభించింది. ప్రధాన టోర్నీకి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లతో జట్టు బలాబలాలను పరీక్షించేందుకు సిద్ధమైన టీమిండియా తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది.
ఈ నేపథ్యంలో బుధవారం జరిగే చివరిదైన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ధోని బృందం తలపడనుంది. ఇంగ్లండ్ కూడా తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగే ప్రధాన మ్యాచ్‌కంటే ముందు ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది.
రహానే రాణిస్తాడా
వార్మప్ మ్యాచ్‌లతో సంబంధం లేకుండా జట్టులో కచ్చితంగా ఉండే బ్యాట్స్‌మెన్‌లో ధోని, యువరాజ్, కోహ్లి, రైనా ఉన్నారు. ముఖ్యంగా వన్డే జట్టులో స్థానం కోల్పోయి, టి20ల్లో వచ్చిన యువీ, రైనా ఆకట్టుకున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మాత్రం ‘నిలకడగా’ విఫలమవుతున్నారు. వీరిలో ఒకరిని తప్పించి రహానేకు చోటు కల్పించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఆడిన అనుభవం అతనికి ఉంది. అయితే ఒక మంచి ఇన్నింగ్స్‌తో చోటు ఖాయం చేసుకోవాల్సిన రహానే గత మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను రాణిస్తే ప్రధాన టోర్నీలోనూ తుది జట్టులో కొనసాగవచ్చు. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా అశ్విన్, జడేజా ఉన్నారు.
అశ్విన్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో ప్రత్యర్థిని నిలువరించాడు. మిశ్రా పదును పరీక్షించేందుకు ఈ మ్యాచ్‌లోనూ అవకాశం ఉంది. భారత పేస్ బౌలింగ్ మాత్రం కుదురుకున్నట్లు లేదు. షమీ ప్రధాన పేసర్‌గా కాగా, భువనేశ్వర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక 15 మంది సభ్యుల జట్టులో మోహిత్ శర్మకు మాత్రమే తొలి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగని కెప్టెన్ ధోని రెండో వార్మప్‌ను బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వాడుకోవచ్చు. మంగళవారం ఆరోన్, అశ్విన్ మినహా మిగతా సభ్యులంతా ప్రాక్టీస్ చేశారు.
బ్రాడ్‌కు గాయం
మరోవైపు ఇంగ్లండ్ కూడా వైఫల్యంతోనే టోర్నీని మొదలు పెట్టింది. మోకాలి గాయంతో బాధ పడుతున్న కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్ తొలి మ్యాచ్‌లో ఆడలేదు. జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్‌తో మ్యాచ్‌లోనూ బ్రాడ్ బరిలోకి దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
అలెక్స్ హేల్స్‌తో పాటు మైకేల్ లంబ్, కీపర్ బట్లర్ ధాటిగా ఆడగల సమర్థులు. కొత్త కుర్రాడు జోర్డాన్, స్పిన్నర్లు మొయిన్ అలీ, ట్రెడ్‌వెల్‌పై ఆ జట్టు బౌలింగ్ ఆధార పడి ఉంది. రవి బొపారా, ల్యూక్ రైట్, బ్రెస్నన్ రూపంలో ఆ జట్టులో కూడా ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. సుదీర్ఘ ప్రయాణం చేసి వెస్టిండీస్ నుంచి ఢాకా చేరుకున్న ఇంగ్లండ్ వరుసగా రెండు రోజుల్లో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుండటం విశేషం.
జట్ల వివరాలు:
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, యువరాజ్, రైనా, అశ్విన్, జడేజా, బిన్నీ, భువనేశ్వర్, షమీ, ఆరోన్, మోహిత్ శర్మ, మిశ్రా.
ఇంగ్లండ్: బ్రాడ్ (కెప్టెన్), బొపారా, బ్రెస్నన్, బట్లర్, డెర్న్‌బాచ్, హేల్స్, జోర్డాన్, లంబ్, మొయిన్ అలీ, మోర్గాన్, పెర్రీ, రూట్, స్టోక్స్, ట్రెడ్‌వెల్, రైట్.
మిశ్రాను చితక్కొట్టిన ధోని!
లంకతో వార్మప్ మ్యాచ్‌కు ముందు ఎలాంటి ప్రాక్టీసూ చేయని భారత కెప్టెన్ ధోని మంగళవారం మాత్రం నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాడు. అయితే కెప్టెన్ జోరుకు బలైంది మాత్రం లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. అతని బౌలింగ్‌లో 10 బంతులు ఆడిన ధోని వాటిని భారీషాట్లుగా మలిచాడు.
మైదానంలోనైతే అవి కనీసం 3 సిక్సర్లు, 4 ఫోర్లుగా మారేవి! బహుశా మిశ్రా బలహీనత తెలియడం వల్లనో, తాను అలవోకగా ఎదుర్కొన్న తీరుని బట్టి గానీ ఈ లెగ్‌స్పిన్నర్‌కు తుది జట్టులో చాన్స్ ఇచ్చేందుకు ధోని వెనుకాడుతున్నట్లు పరిస్థితి చూస్తే అర్ధమవుతోంది. గతంలో సౌరవ్ గంగూలీకి కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్ మురళీ కార్తీక్‌పై ఇదే తరహా అపనమ్మకం ఉండేది. తనను నెట్స్‌లో ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేని కార్తీక్‌ను గంగూలీ కావాలనే పక్కన పెట్టాడని అప్పట్లో చెప్పుకునేవారు!