పాకిస్తాన్పై భారత్ ఘనవిజయం
ఇఫో(మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో భారత జట్టు 5-1 తేడాతో దాయాది పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. భారత ఆటగాడు ఎస్ వీ సునీల్ రెండు గోల్స్ సాధించగా, మన్ ప్రీత్ సింగ్, రూపేందర్ పాల్ సింగ్, తల్విందర్ సింగ్లు తలో గోల్ చేసి జట్టు భారీ విజయంలో పాలు పంచుకున్నారు.
ఆట ప్రారంభమైన నాల్గో నిమిషంలోనే మన్ ప్రీత్ సింగ్ గోల్స్ చేసి భారత జట్టును జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లగా, ఏడో నిమిషంలో పాకిస్తాన్ ఆటగాడు మొహ్మద్ ఇర్ఫాన్ పెనాల్టీ కార్నర్ గోల్గా మలచి స్కోరును సమం చేశాడు. ఆపై 10 వ నిమిషంలో సునీల్ గోల్ నమోదు చేయడంతో భారత జట్టు 2-1 ఆధిక్యం సాధించింది. రెండో క్వార్టర్లో ఇరు జట్లు గోల్ నమోదు చేయలేదు. మూడో క్వార్టర్ లో భాగంగా ఆట 41వ నిమిషంలో సునీలో మరో గోల్ చేయడంతో భారత్ కు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఇక చివరి క్వార్టర్ లో రూపేందర్ సింగ్, తల్వీందర్లు చెరో గోల్ చేయడంతో భారత్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. దీంతో టోర్నీలో మూడు విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టు రెండో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు జపాన్, కెనడాలపై భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే.