పాక్‌కు భారత్ ‘పంచ్’ | India thrash Pakistan 5-1 in Sultan Azlan Shah Hockey Cup | Sakshi
Sakshi News home page

పాక్‌కు భారత్ ‘పంచ్’

Published Wed, Apr 13 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

పాక్‌కు భారత్ ‘పంచ్’

పాక్‌కు భారత్ ‘పంచ్’

* పాకిస్తాన్‌పై 5-1తో ఘనవిజయం    
* సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న సర్దార్ బృందం   
* అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ

ఇపో (మలేసియా): పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోయినా... అనుభవంతో సంబంధం లేకుండా ఆద్యంతం కలిసికట్టుగా ఆడుతూ... ఆధిపత్యం చలాయిస్తూ... భారత హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై మరో చిరస్మరణీయ విజయం సాధించింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5-1 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది.

ఈ గెలుపుతో  సర్దార్ సింగ్ బృందం ఫైనల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. భారత్ తరఫున ఎస్‌వీ సునీల్ (10వ, 41వ ని.లో) రెండు గోల్స్ చేయగా... మన్‌ప్రీత్ సింగ్ (4వ ని.లో), తల్విందర్ సింగ్ (50వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (54వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. పాకిస్తాన్‌కు కెప్టెన్ మొహమ్మద్ ఇర్ఫాన్ (7వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. భారత్ ఖాతాలో మరో రెండు గోల్స్ చేరేవి. అయితే 55వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను రూపిందర్ వృథా చేయగా.. 59వ నిమిషంలో రమణ్‌దీప్ సింగ్ చేసిన గోల్‌ను అంపైర్ తిరస్కరించారు. పాక్ జట్టులో ఏడుగురికి 100 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్నా భారత్ జోరు ముందు ఆ జట్టు నిలువలేకపోయింది.
 
మొత్తం ఏడు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా 12 పాయింట్లతో అగ్రస్థానంలో, న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. బుధవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది.
 ఈ ఏడాది స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ద్వితీయ శ్రేణి జట్టును బరిలోకి దించి ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన భారత్... అజ్లాన్ షా కప్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. మేటి గోల్‌కీపర్ శ్రీజేష్, వైస్ కెప్టెన్ రఘునాథ్, ఆకాశ్‌దీప్ సింగ్, ధరమ్‌వీర్ సింగ్, బీరేంద్ర లాక్రాలాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత్ ఈ టోర్నీలో అడుగుపెట్టింది.
 
కీలక ఆటగాళ్లు లేకపోయినా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ తొలి నిమిషం నుంచే దూకుడుగా ఆడింది. ఫలితంగా ఆట నాలుగో నిమిషంలోనే మన్‌ప్రీత్ సింగ్ కళ్లు చెదిరేరీతిలో రివర్స్ షాట్‌తో గోల్ సాధించి భారత్ ఖాతా తెరిచాడు. టోర్నీ మొదలైన రోజే తండ్రి మరణించడంతో స్వదేశానికి వెళ్లిన మన్‌ప్రీత్ సింగ్ తిరిగి వచ్చి నేరుగా పాకిస్తాన్‌పై మ్యాచ్ ఆడటం గమనార్హం. అయితే భారత్‌కు గోల్ చేసిన ఆనందం ఎక్కువసేపు నిలువలేదు.

ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇర్ఫాన్ గోల్‌గా మలచడంతో పాక్ 1-1తో స్కోరును సమం చేసింది. కానీ వెంటనే తేరుకున్న భారత్‌కు సునీల్ పదో నిమిషంలో గోల్ అందించడంతో టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 25 గజాల దూరం నుంచి మన్‌ప్రీత్ కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో ఉన్న సునీల్ లక్ష్యానికి చేర్చాడు. రెండో క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా కాలేదు. మూడో క్వార్టర్ మొదలైన 11 నిమిషాలకు సునీల్ చేసిన గోల్‌తో భారత్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

కొతాజిత్ సింగ్ అందించిన పాస్‌ను నికిన్ తిమ్మయ్య గోల్‌పోస్ట్ ముందున్న సునీల్‌కు అందించగా అతను మిగతా పనిని పూర్తి చేశాడు. అనంతరం నాలుగు నిమిషాల వ్యవధిలో తల్విందర్, రూపిందర్ ఒక్కో గోల్ చేయడంతో భారత్ 5-1తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
 
ఒక గోల్ చేయడంతోపాటు గోల్ అవకాశాలను సృష్టించిన మన్‌ప్రీత్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. స్కోరు పరంగా పాకిస్తాన్‌పై భారత్‌కిది రెండో పెద్ద విజయం. 2003 చాంపియన్స్ ట్రోఫీలో, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రెండుసార్లు 7-4 గోల్స్ తేడాతో పాక్‌ను ఓడించింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ మధ్య 165 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 53 మ్యాచ్‌ల్లో, పాక్ 82 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 30 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత్ 318 గోల్స్ చేయగా... పాకిస్తాన్ 384 గోల్స్ సాధించింది.
 
అజ్లాన్ షా కప్‌లో నేడు
భారత్ X న్యూజిలాండ్
మధ్యాహ్నం గం. 1.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement