సలాలా (ఒమన్): ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా గురువారం జరిగిన ఫైనల్లో 2–1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున అంగద్‌బీర్ సింగ్ (13వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (20వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... పాకిస్తాన్ జట్టుకు అలీ బషారత్ (38వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్‌గా ఆసియా కప్ టైటిల్ నెగ్గడం భారత్‌కిది నాలుగోసారి. గతంలో భారత్ 2004, 2008, 2015లలో విజేతగా నిలిచింది.
తాజా టైటిల్‌తో ఆసియా కప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. పాకిస్తాన్ మూడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో మలేసియాపై గెలిచింది. ఆసియా కప్ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారత్, పాకిస్తాన్, కొరియా జట్లు ఈ ఏడాది డిసెంబర్‌లో కౌలాలంపూర్‌లో జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. తాజా టోర్నీలో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది. టోర్నీ మొత్తంలో భారత్ 50 గోల్స్ సాధించి... కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అభినందించారు. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షలు నగదు పురస్కారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment