వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ అర్హత | India to World Cup qualifying match | Sakshi
Sakshi News home page

వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ అర్హత

Published Fri, Feb 17 2017 11:45 PM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ అర్హత - Sakshi

వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ అర్హత

క్వాలిఫయింగ్‌ టోర్నీలో మరో విజయం
బంగ్లాను చిత్తు చేసిన భారత మహిళలు
గెలిపించిన మోనా, మిథాలీ రాజ్‌


కొలంబో: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. లీగ్‌ దశ నుంచి వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఫర్జానా హక్‌ (107 బంతుల్లో 50; 5 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, షర్మీన్‌ అక్తర్‌ (35) రాణించింది. భారత బౌలర్లలో పేసర్‌ మాన్సి జోషి 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత్‌ 33.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 158 పరుగులు చేసింది. దీప్తి శర్మ (1) విఫలం కాగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మోనా మేష్రమ్‌ (92 బంతుల్లో 78 నాటౌట్‌; 12 ఫోర్లు), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (87 బంతుల్లో 73 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 136 పరుగులు జోడించారు. ఖదీజా వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచి మిథాలీ భారత్‌ విజయాన్ని ఖాయం చేసింది.

భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా కూడా వరల్డ్‌ కప్‌కు క్వాలిఫై అయింది. మరో రెండు స్థానాలు ఆదివారం ఖరారవుతాయి. ఇంగ్లండ్‌లో జూన్‌ 24 నుంచి జూలై 23 వరకు ప్రపంచ కప్‌ జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు నాలుగు జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ ముందే నేరుగా అర్హత సాధించాయి. వాస్తవానికి భారత్‌కు కూడా ఆ సమయంలో అవకాశం ఉన్నా... పాకిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడేందుకు నిరాకరించడం వల్ల జట్టు ఆరు పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా భారత్‌ను దాటి విండీస్‌ ముందుకు దూసుకుపోయింది.  ఆదివారం జరిగే తమ చివరి సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్‌ తలపడుతుంది. సూపర్‌ సిక్స్‌ దశ ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 21న ఫైనల్‌ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement