దక్షిణాఫ్రికాలో భారత పర్యటన షెడ్యూల్‌కు సంబంధించి క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందని బీసీసీఐ వెల్లడించింది. అందుకే ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ఆ పర్యటన అనిశ్చితిలో పడిందని స్పష్టం చేసింది.
ముంబై: దక్షిణాఫ్రికాలో భారత పర్యటన షెడ్యూల్‌కు సంబంధించి క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందని బీసీసీఐ వెల్లడించింది. అందుకే ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ఆ పర్యటన అనిశ్చితిలో పడిందని స్పష్టం చేసింది. ‘సుదీర్ఘ కాలంగా నడుస్తున్న కొన్ని అంశాలను సరైన దిశలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ విషయమైనా బీసీసీఐ సాధారణంగానే వ్యవహరిస్తుంది. ప్రొటోకాల్ ప్రకారం సిరీస్‌ను నిర్ణయించడమనేది సంయుక్తంగా ప్రకటించాల్సిన అంశం. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను బీసీసీఐ ఆమోదం లేకుండా ప్రకటించారు’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు.
బీసీసీఐని సంప్రదించకుండా నవంబర్-జనవరి మధ్యలో మూడు టెస్టులు, ఓ వన్డే సిరీస్‌ను సీఎస్‌ఏ ప్రకటించిన సంగతి తెలి సిందే. అయితే దక్షిణాఫ్రికా పర్యటనపై తమకు ఎలాంటి ఆందోళన లేదని పటేల్ వెల్లడించారు. ‘చాలా దేశాలు భారత్‌తో క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి సమస్య లేదు. అయితే పాక్, శ్రీలంకతో సిరీస్ జరుగుతాయని వస్తున్న ఊహాగానాలు తప్పు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు’ అని కార్యదర్శి అన్నారు. విండీస్‌తో సిరీస్‌కు వేదికలను ఖరారు చేయలేదన్నారు. ముంబైలోని సీసీఐకి అదనంగా మరో మ్యాచ్‌ను కేటాయించే అవకాశముందని చెప్పారు.