కుదించిన లక్ష్యంతోనైనా మొదటి మ్యాచ్‌లో ఫలితం తేలింది. కనీసం ఛేదనకు దిగకుండానే రెండోది రద్దయి పోయింది. దీంతో మూడో మ్యాచ్‌కు వచ్చేసరికి... ఓడినా సిరీస్ చేజారని నిశ్చింత ఆస్ట్రేలియాది. గెలుపుతో... తమ జైత్ర యాత్రకు అడ్డుకట్ట పడకుండా చూసుకోవాల్సిన ఒత్తిడి టీమిండియాది. మరి... చివరి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో!
సిడ్నీ: ఆట కంటే వరుణుడి అడ్డంకులే ఎక్కువగా వస్తున్న ఆస్ట్రేలియా–భారత్ టి20 సిరీస్... ఆఖరికి వచ్చింది. రెండు జట్ల మధ్య ఆదివారం సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్‌సీజీ)లో చివరి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 1–0 ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టును ఇందులో ఓడించి... 1–1తో లెక్క సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తద్వారా ఈ ఫార్మాట్‌లో వరుసగా ఏడు సిరీస్‌లు నెగ్గిన తర్వాత ఓటమి ఎదురు కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. మరోవైపు చాన్నాళ్ల తర్వాత ఓ పెద్ద జట్టుపై సిరీస్ విజయం సాధించే అవకాశాన్ని కంగారూలు అంత తేలిగ్గా వదులుకుంటారని భావించలేం. ఈ నేపథ్యంలో మూడో టి20లో ఎవరికి అనుకూల ‘ముగింపు’ దక్కుతుందో చూడాలి.
అదే కూర్పా.. లేక మార్పా...?
భారత్ రెండో టి20కి ఒక మార్పుతో బరిలో దిగుతుందనుకుంటే అదేమీ లేకుండానే ఆడింది. ఇప్పుడు మరోసారి ఆ ఒక్క స్థానంపైనే ఊగిసలాట నడుస్తోంది. పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఆడిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, పరుగులిస్తున్నా పేస్‌లో వైవిధ్యంతో ఖలీల్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి, బాగా అవసరం అనుకుంటే తప్ప అతడిని తప్పించకపోవచ్చు. మెల్‌బోర్న్‌లో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మెరుగ్గా కనిపించాడు. చైనామన్ కుల్దీప్ యాదవ్, పేసర్లు భువనేశ్వర్, బుమ్రాల బౌలింగ్‌పై బెంగలేదు. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌పైనే ఆందోళన నెలకొంది. టెస్టు సిరీస్‌కు ఓపెనర్ రేసులో నిలవాలంటే అతడు ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపాలి. రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నందున జట్టు ఛేదనకే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ధావన్ ఫామ్‌కు, కోహ్లి, రోహిత్ జోరు తోడైతే లక్ష్యాన్ని అవలీలగా అందుకోగలం. మన బౌలర్ల ఫామ్ ప్రకారం చూస్తే... మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు.
ఆసీస్ అవకాశం వదులుకుంటుందా?
వరుణుడి దయతో తొలి మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా... అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి కొంత బయటపడింది. కానీ, రెండో టి20లో ఆ జట్టు బలహీనతలు బయటపడ్డాయి. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ భారత బౌలింగ్‌ను ఎదుర్కొనలేక తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. వారి బౌలింగ్ కూడా ఏమంత గొప్పగా లేనందున ఒకవేళ ఆట పూర్తిగా సాగి ఉంటే మ్యాచ్‌నే కోల్పోయేవారు. ఓపెనర్లు డీయార్సీ షార్ట్, కెప్టెన్ ఫించ్ వైఫల్యంతో లిన్, మ్యాక్స్‌వెల్, మెక్‌డెర్మాట్‌లపై బ్యాటింగ్ భారం పడుతోంది. అయితే, పొట్టి ఫార్మాట్‌లో ఏ క్షణమైనా విరుచుకుపడే వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందే. గాయపడిన స్టాన్‌లేక్ స్థానంలో సిడ్నీ మ్యాచ్‌కు కీలక పేసర్ మిచెల్ స్టార్క్‌ను జట్టుతో చేర్చినా అతడు ఆడేది అనుమానమే. పేసర్లు కూల్టర్‌నీల్, ఆండ్రూ టైతో పాటు స్పిన్నర్ ఆడమ్ జంపా టీమిండియాను ఎంతమేరకు నిలువరిస్తారనే దానిపైనే ఆసీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్, బుమ్రా, చహల్/ఖలీల్
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, మెక్‌డెర్మాట్, క్యారీ, టై, జంపా, బెహ్రెన్‌డార్ఫ్, కూల్టర్‌నీల్/ స్టార్క్
పిచ్, వాతావరణం
ఎస్‌సీజీ పిచ్ నెమ్మదిగా ఉంటుంది. పేస్‌కు పెద్దగా అనుకూలం కాదు. ఆదివారం వర్ష సూచన లేదు.
►మధ్యాహ్నం గం.1.20 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment