భారత్-ఆసీస్ మ్యాచ్ హైలైట్స్
మొహాలి: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పలు విశేషాలు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో విరోచిత ఇన్నింగ్స్ తో అదరగొట్టిన టీమిండియా స్టార్ బాట్స్ మన్ విరాట్ కోహ్లి తన బ్యాటింగ్ గణాంకాలు మరింత మెరుచుపరుచుకున్నాడు. కంగారు టీమ్ పై ధోని సేన తన రికార్డును మరింత పటిష్టం చేసుకుంది.
* విరాట్ కోహ్లి 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి టీ20ల్లో రెండో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు సాధించాడు. అతడి వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 90 నాటౌట్. 2016, జనవరి 16న ఆస్ట్రేలియాపైనే నమోదు చేశాడు.
* టీ20ల్లో విజయవంతమైన ఛేజింగ్స్ లో భారత్ బ్యాట్స్ మన్ చేసిన అత్యధిక స్కోరు కోహ్లిదే కావడం విశేషం. 2012, సెప్టెంబర్ లో కొలంబొలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి 61 బంతుల్లో 78 పరుగులు చేశాడు. తాజాగా దీన్ని అధిగమించాడు.
* అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ రికార్డును కోహ్లి సమం చేశాడు. 15 సార్లు అతడీ ఘనత సాధించాడు. క్రిస్ గేల్(రెండు సెంచీలు, 13 అర్ధసెంచరీలు), బ్రెండన్ మెక్ కల్లమ్(రెండు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు) సరసన నిలిచాడు.
* 12సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ తో కోహ్లి టీమిండియా విజయం సాధించిపెట్టాడు. ఈ విషయంలోనూ మెక్ కల్లమ్ తో సమానంగా నిలిచాడు.
* విరాట్ కోహ్లి 9 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(ఎంఓఎం) అవార్డు అందుకున్నాడు. షాహిద్ ఆఫ్రిది(11) మాత్రమే అతడి కంటే ముందున్నాడు.
* ఆస్ట్రేలియాతో జరిగిన 9 మ్యాచుల్లో కోహ్లి మూడుసార్లు మ్యాన్ ది మ్యాచ్(ఎంఓఎం) దక్కించుకున్నాడు. ఈ విషయంలో క్రిస్ గేల్, ఉమర్ అక్మల్, యువరాజ్ సింగ్ ను వెనక్కునెట్టాడు. వీరు ముగ్గురు ఆసీస్ పై రెండేసిసార్లు ఎంఓఎంగా ఎంపికయ్యారు. టీ20ల్లో ఒక కేలండర్ ఇయర్ లో ఆరుసార్లు ఎంఓఎం అందుకుని ఎవరూ సాధించని ఘనత సాధించాడు. 2012లో షేన్ వాట్సన్ ఐదుసార్లు ఎంఓఎం సాధించాడు.
* ఆస్ట్రేలియాతో ఆడిన 13 టీ20ల్లో టీమిండియా 9 సార్లు విజయం సాధించగా, నాలుగింటిలో ఆసీస్ గెలిచింది. కంగారూ టీమ్ పై ధోనిసేన సక్సెస్ రేటు 69.23 శాతంగా ఉంది. మరేదేశంపైనా ఇంత సక్సెస్ రేటు లేదు.
* టీ20 మ్యాచుల్లో ఆస్ట్రేలియా 9 సార్లు మరేయితర జట్టుచేతిలో ఓడిపోలేదు. ఆసీస్ ను 9 సార్లు ఓడించిన ఘనత టీమిండియాకే దక్కింది.
* 2013, అక్టోబర్ 10- 2016 మార్చి 27 మధ్యలో వరుసగా ఆరు మ్యాచుల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించింది. అంతకుముందు ఇంగ్లండ్ పేరిట ఈ రికార్డును ధోని సేన సమం చేసింది. 2008, ఫిబ్రవరి 5-2013, ఫిబ్రవరి 9 మధ్యలో న్యూజిలాండ్ పై ఇంగ్లీషు టీమ్ వరుసగా ఆరు విజయాలు నమోదు చేసింది.