యువ ‘ముద్ర’ వేస్తారా! | india vs england first test match starts to day | Sakshi
Sakshi News home page

యువ ‘ముద్ర’ వేస్తారా!

Published Wed, Jul 9 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

యువ ‘ముద్ర’ వేస్తారా!

యువ ‘ముద్ర’ వేస్తారా!

కోటి ఆశలతో భారత బృందం
 ఇంగ్లండ్‌పై ప్రతీకారానికి సన్నద్ధం!
 నేటినుంచి తొలి టెస్టు
 
 మ. గం. 3.30 నుంచి
  స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 
 సరిగ్గా మూడేళ్ల క్రితం... అద్భుత ఫామ్‌తో, అగ్రస్థానంతో ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన భారత క్రికెట్ జట్టు పర్యటన ముగిసే సరికి అన్నీ కోల్పోయి అవమాన భారంతో వెనుదిరిగింది. 0-4 తేడాతో ఎదురైన ఆ పరాజయం విదేశాల్లో భారత్ బలహీనతను బయట పెట్టింది. తర్వాతి ఏడాదే ఇంగ్లండ్ మన దగ్గరికి వచ్చింది. ఇంతకింతా బదులు తీర్చుకుంటామంటూ గొప్పలు పోయిన ధోనిసేన అనూహ్యంగా చేతులెత్తేసింది. సొంతగడ్డపై కూడా ఓటమితో తలదించుకునేలా చేసింది.  
 
 ఇప్పుడు ప్రతీకారం అంటే ఎలా ఉండాలి? గత అనుభవాలకు రెట్టింపు సమాధానమివ్వాలి. దిమ్మ తిరిగేలా బదులు తీర్చుకోవాలి. తిరుగులేని విజయాలతో సత్తా చూపించాలి. ఇదే లక్ష్యంతో భారత కుర్రాళ్లు ఇంగ్లండ్‌లో సిరీస్‌కు సిద్ధమయ్యారు. మరి ధోనిసేన ఆశ తీరుతుందా? ఇంగ్లండ్‌ను వాళ్ల దేశంలోనే ఓడిస్తారా?
 
 నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ గడ్డపై పాత పరాభవాలను మరచి కొత్తగా విజయాల బాట పట్టేందుకు భారత క్రికెట్ జట్టు ముందు అవకాశం వచ్చింది. యువ ఆటగాళ్లతో నిండిన టీమ్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తమ ప్రతిభను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. మరో వైపు యాషెస్‌లో చిత్తుగా ఓడిన తర్వాత ఇటీవలే శ్రీలంక చేతిలోనూ సిరీస్ కోల్పోయి ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. చాలా మంది సీనియర్లూ ఆ జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పని పట్టి, పట్టు సాధించేందుకు... పనిలో పనిగా గత పరాజయాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా ధోనిసేనకు ఇదే సరైన తరుణంగా చెప్పవచ్చు.  
 
 యువ బలగమే బలం
 గత పర్యటనలో దిగ్గజాలు ఉన్నా... భారత జట్టుకు ఘోర పరాజయం తప్పలేదు. కానీ ఈ సారి మాత్రం జట్టు పూర్తిగా యువ ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలపైనే ఆధార పడుతోంది. జట్టులోని ఆటగాళ్లలో ధోని, గంభీర్, ఇషాంత్‌లకు మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. అయితే గత మూడేళ్ల కాలంలో దూసుకొచ్చిన కోహ్లి, పుజారా జట్టుకు మూలస్థంభాలుగా నిలిచారు. వీరిద్దరికి సిరీస్ గమనాన్ని మార్చగల సత్తా ఉందంటే ఆశ్చర్యం లేదు.
 
  రహానే కూడా కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఈ ముగ్గురు గత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల్లో చక్కగా రాణించారు. బౌలింగ్‌లో ఇషాంత్ ఒక్కడే అనుభవజ్ఞుడు. దాంతో షమీ, భువనేశ్వర్‌లపై పెద్ద బాధ్యత ఉంది. ఇతర యువ పేసర్లు ఆరోన్, పాండే, పంకజ్‌సింగ్‌లకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చెప్పలేము. మొత్తానికి భారత జట్టు అన్ని విధాలుగా పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. భారత్ ఐదుగురు బౌలర్లలో బరిలోకి దిగే అవకాశం ఉంది.
 
 ఇంగ్లండ్ తడబాటు...
 కెప్టెన్ అలిస్టర్ కుక్ భారత్‌పై గత రెండు సిరీస్‌లలో కలిపి 14 ఇన్నింగ్స్‌లలో 910 పరుగులు చేశాడు. కానీ గత 25 ఇన్నింగ్స్‌లుగా అతను ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది.
 
 ఇక సీనియర్లు పీటర్సన్, ట్రాట్, స్వాన్ దూరం కావడంతో ఇంగ్లండ్ జట్టు కూడా కుర్రాళ్లతో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవల లంక చేతిలో పరాజయం పాలు కావడం పరిస్థితిని సూచిస్తోంది. అండర్సన్, బ్రాడ్, ప్లంకెట్‌లతో ఆ జట్టు పేస్ భారత్‌ను కట్టడి చేయడంపై దృష్టి పెట్టింది. స్వాన్ స్థాయి స్పిన్నర్ లేకపోవడం ఆ జట్టుకు ప్రధాన సమస్య. అయితే బలాన్స్, రాబ్సన్, మొయిన్ లాంటి యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడం ఇంగ్లండ్‌కు కలిసి రావచ్చు.
 
 బిన్నీకి చాన్స్!
 ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో రాణించిన స్టువర్ట్ బిన్నీకి తొలి టెస్టు ఆడే అవకాశం లభించవచ్చు. బౌలింగ్‌ను పటిష్టం చేసుకోవడంలో భాగంగా రోహిత్‌శర్మకు బదులుగా ఆల్‌రౌండర్‌గా బిన్నీకి అవకాశం దక్కొచ్చు. స్పిన్నర్‌గా కూడా అశ్విన్‌కంటే ఆల్‌రౌండర్ జడేజాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
 
 దక్షిణాఫ్రికాలో ఆడిన తొలి టెస్టుకు, న్యూజిలాండ్‌లో ఆడిన చివరి టెస్టును పోలిస్తే మేం ఎంతో మెరుగుపడాలని అర్థమవుతుంది. ఇక మరింత ముందుకు వెళతాం. ఉపఖండం బయట ఐదుగురు బౌలర్లతో ఆడటం పెద్ద సవాలే. నేను ఆరోస్థానంలో ఆడేందుకు సిద్ధం     -ఎం.ఎస్. ధోని, భారత కెప్టెన్
 
 పిచ్, వాతావరణం
 పిచ్‌పై మంగళవారం పూర్తిగా పచ్చిక తొలగించారు. బౌన్స్‌కు అవకాశం లేని, పూర్తిగా పొడిగా ఉపఖండపు వికెట్‌గా కనిపిస్తోంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement