'విన్' డోర్ తెరుస్తారా!
తీవ్ర ఒత్తిడిలో భారత్
ఉత్సాహంగా సఫారీలు
నేడు ఇండోర్‌లో రెండో వన్డే
ఓడితే సిరీస్‌లో కోలుకోవడం కష్టం
రెండేళ్ల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ఒక్క విజయం కూడా లేకుండా వెనుదిరిగింది. కానీ ఇప్పుడు ఆడుతోంది సొంతగడ్డపైనా లేక మళ్లీ దక్షిణాఫ్రికాలో అన్న తీరుగా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలోనూ పరాజయం టీమిండియాను వెక్కిరించింది. మ్యాచ్ మ్యాచ్‌కీ ప్రత్యర్థి ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే... మన శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది. మరో మ్యాచ్ ఓడితే ఇక వన్డే సిరీస్‌లోనూ కోలుకోవడం మహా కష్టంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో జట్టు మళ్లీ గాడిలో పడాలంటే అత్యవసరంగా విజయం కావాలి.
ఇండోర్: టి20 సిరీస్‌ను కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమిపాలైన భారత జట్టు కీలక పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి హోల్కర్ స్టేడియంలో నేడు (బుధవారం) జరిగే రెండో వన్డేలో దక్షిణాఫ్రికాతో ధోని సేన తలపడుతుంది. ఈ మ్యాచ్ గనక చేజారితే సిరీస్‌లోని చివరి మూడు వన్డేలూ నెగ్గాల్సిన సవాల్ భారత్‌కు ఎదురవుతుంది. ప్రస్తుతం జట్టు ఫామ్‌తో అది అంత సులభం కాదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి దశలో సిరీస్ విజయంపై దృష్టి పెట్టవచ్చు. మరో వైపు దక్షిణాఫ్రికా తమ జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
హర్భజన్‌కు చాన్స్!
ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టిన ఏకైక బౌలర్ అశ్విన్. పక్కటెముకల గాయంతో గత మ్యాచ్‌లోంచి మధ్యలోనే తప్పుకున్న అశ్విన్ ఈ మ్యాచ్‌లోగా కోలుకోనే అవకాశం కనిపించడం లేదు. దీనిపై అధికారికంగా మేనేజ్‌మెంట్‌నుంచి ప్రకటన లేకపోయినా...అతను ఆడకపోతే హర్భజన్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుంది. టి20ల్లాగే గత వన్డేలోనూ పేసర్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. ఉమేశ్, భువీ ఇద్దరూ సమష్టిగా విఫలమయ్యారు. భువీ స్థానంలో మోహిత్‌కు అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్ విషయంలో భారత్ ఎప్పుడూ పటిష్టంగానే కనిపిస్తుంది. కానీ గత మ్యాచ్‌లో కీలక సమయంలో మిడిలార్డర్ రాణించలేకపోయింది.
రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్ ధావన్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. రహానే మళ్లీ మూడో స్థానంలో ఆడటం ఖాయం. కానీ కోహ్లి, రైనాలు ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. గత మ్యాచ్‌లో అనూహ్యంగా కోహ్లి తడబడ్డాడు. ఆల్‌రౌండర్‌గా రెండు రంగాల్లోనూ విఫలమైన స్టువర్ట్ బిన్నీ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. అయితే అన్నింటికంటే మరోసారి అందరి దృష్టి కెప్టెన్ ధోనిపైనే ఉంది. విమర్శకులు మళ్లీ తమ కత్తికి పదును పెడుతుండటంతో అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా కూడా అతను సత్తా చాటాల్సి ఉంది.
డు ప్లెసిస్ అనుమానం!
భారత్ పర్యటనకు వచ్చినప్పుడు తాము ఆరంభంలోనే ఆధిక్యం ప్రదర్శిస్తామని దక్షిణాఫ్రికా కూడా ఊహించి ఉండదు. కానీ ఆ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో ఒక్కసారిగా ఫేవరెట్‌గా మారిపోయింది. ఫార్మాట్ ఏదైనా డివిలియర్స్ ముందు భారత బౌలర్లు నిలబడలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో అది మరింత స్పష్టంగా కనిపించింది. ఒకటినుంచి ఏడో నంబర్ వరకు మిల్లర్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా రాణిస్తుండటం జట్టు బ్యాటింగ్‌ను పటిష్టంగా మార్చింది.
గత ఆరు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయిన మిల్లర్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అయితే గత మ్యాచ్‌లో గాయపడిన డు ప్లెసిస్ కోలుకోకుంటేనే మిల్లర్‌కు మరో అవకాశం దక్కవచ్చు. ఒక వేళ ప్లెసిస్ సిద్ధమైతే మిల్లర్ స్థానంలో ఆల్‌రౌండర్ మోరిస్ గానీ కొత్త ఆటగాడు జోండోకు గానీ చోటు లభిస్తుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో పాటు స్పిన్నర్ తాహిర్ గత మ్యాచ్‌లాగే కీలక సమయంలో వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పగల సమర్థుడు. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.
మ. గం. 1.30నుంచి
స్టార్ స్పోర్ట్స్ 1, డీడీలలో ప్రత్యక్ష ప్రసారం
జట్ల వివరాలు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, బిన్నీ, హర్భజన్, మిశ్రా, ఉమేశ్, భువనేశ్వర్/మోహిత్.
దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, బెహర్దీన్, మిల్లర్/మోరిస్, స్టెయిన్, రబడ, మోర్కెల్, తాహిర్.
గతంలో ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది. 2011 తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతోంది.
పిచ్, వాతావరణం: హోల్కర్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే భారీ స్కోర్ల వేదిక. చిన్న మైదానం కావడంతో పాటు లాంగాన్, లాంగాఫ్ బౌండరీలు కూడా చిన్నవి. సెహ్వాగ్ వన్డే డబుల్ సెంచరీ కొట్టింది ఇక్కడే. మ్యాచ్ రోజు ఉదయం ఎక్కువ వేడి (37 డిగ్రీల వరకు), ఆ తర్వాత బాగా చల్లగా ఉండవచ్చు. వర్ష సూచన లేదు.
మేం నంబర్‌వన్ జట్టుగా నిలవాలంటే చిన్న చిన్న తప్పులకు కూడా అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఈ సారి అవే తప్పులు పునరావృతం చేయబోం. గతంలో ఇలాంటి ఎన్నో సందర్భాల్లో జట్టు కోలుకొని బాగా ఆడింది. చివరి ఓవర్లలో మా బౌలింగ్ విఫలమైన మాట వాస్తవం. అయితే డివిలియర్స్‌లాంటి బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేసేటప్పుడు మరింత తెలివిగా వ్యవహరించాలి. జట్టులోని బౌలర్లంతా బాగా ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవాల్సిన బాధ్యత నాది. అదే క్రమంలో భారీ స్కోర్లు సాధ్యమవుతున్నాయి. సెంచరీ కాగానే ఏకాగ్రత కోల్పోను. మైదానం రికార్డును బట్టి చూస్తే కనీసం 350 పరుగులైనా చేయవచ్చు’ -రోహిత్ శర్మ, భారత బ్యాట్స్‌మన్
ప్రస్తుతం రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. 20 పరుగులు దాటితే అతడిని ఆపడం కష్టమైపోతోంది కాబట్టి తొలి 10 బంతుల్లోనే అవుట్ చేయాలి. మా పేస్ విభాగంలో మార్పులు ఉండవు. కొత్త నిబంధనలు వచ్చాయి కాబట్టి తొలి 10 ఓవర్లు, చివరి 5 ఓవర్లు బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించగలిగితే మ్యాచ్ గెలవొచ్చు. చిన్న మైదానం కాబట్టి బౌలర్లకు చాలా కష్టం. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది’
-లాంగ్‌వెల్ట్, దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్