
ఓపెనర్ల శుభారంభంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తేరుకుంది. కానీ కేవలం 49 పరుగుల స్వల్ప ఆధిక్యంలోనే ఉండటంతో ముప్పు మాత్రం తొలగలేదు. ఇంకా 90 ఓవర్లు... మూడు సెషన్లు ఉన్నాయి. ఏమైనా జరగొచ్చు. ‘డ్రా’ కావొచ్చు. ‘డ్రామా’తో ఫలితం తేలొచ్చు. ఈ నేపథ్యంలో టీమిండియా ‘డ్రా’ కోసం పోరాడాలనుకుంటే తొలి సెషన్‌ను జాగ్రత్తగా ఆడాలి. ఆదమరిస్తే... అనూహ్య డ్రామాతో మ్యాచ్ చేజారే పరిస్థితి కూడా ఉంది.
కోల్‌కతా: భారత ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ ఓపిగ్గా పోరాడారు. ప్రత్యర్థి 122 పరుగుల ఆధిక్యం దృష్ట్యా ప్రతీ షాట్‌ను జాగ్రత్తగా ఆడారు. తొలి వికెట్‌కు 166 పరుగులతో శుభారంభమిచ్చారు. ఇక మిగతా భారాన్ని మిడిలార్డర్ మోస్తే టీమిండియా గెలవకపోయినా... ‘డ్రా’ చేసుకొని ఓటమి నుంచి తప్పించుకోవచ్చు. అంతకుముందు నాలుగో రోజు ఆటలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 83.4 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. హెరాత్ (105 బంతుల్లో 67; 9 ఫోర్లు) లంక ఆధిక్యానికి వెన్నెముకగా నిలిచాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ ఆట నిలిచే సమయానికి 39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (116 బంతుల్లో 94; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (113 బంతుల్లో 73 బ్యాటింగ్; 8 ఫోర్లు) లంకేయులకు తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపారు.
సీమర్ల చేతికే... పదికి పది:
ఓవర్‌నైట్ స్కోరు 165/4తో ఆదివారం ఆట కొనసాగించిన లంక... భారత సీమర్ల ధాటికి తొలి సెషన్లో తడబడింది. డిక్‌వెలా (35; 5 ఫోర్లు), కెప్టెన్ చండిమాల్ (28; 3 ఫోర్లు) జట్టు స్కోరు 200 పరుగులు దాటగానే నిష్క్రమించారు. షనక డకౌటయ్యాడు. దీంతో లంక 201 స్కోరు వద్దే ఏడో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన టెయిలెండర్లలో హెరాత్ ఒక్కడే పోరాడాడు. లంచ్ తర్వాత కాసేపటికే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భువనేశ్వర్, షమీ చెరో 4 వికెట్లు పడగొట్టగా... ఉమేశ్‌కు 2 వికెట్లు దక్కాయి. 1983 తర్వాత స్వదేశంలో భారత పేస్ బౌలర్లు ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి.
ధావన్... ధన్ ధనాధన్:
రాహుల్‌తో కలిసి ధావన్ భారత రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. ఇద్దరు ఇంచుమించు వన్డేను తలపించే ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. దీంతో 70/0 స్కోరుతో టీ విరామానికి వెళ్లారు. అనంతరం కూడా తమ ధాటిని కొనసాగించడంతో మొదట రాహుల్ (65 బంతుల్లో 7 ఫోర్లతో), తర్వాత ధావన్ (74 బంతుల్లో 7 ఫోర్లతో) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. శిఖర్ జోరు పెంచడంతో వేగంగా సెంచరీ దిశగా కదిలాడు. కానీ 6 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. దీంతో ఆట నిలిచే సమయానికి రాహుల్‌తో పుజారా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సోమవారం పుజారా బ్యాటింగ్‌ను కొన సాగిస్తే ఒక టెస్టులో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన తొమ్మిదో క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో భారత్ తరఫున హైదరాబాద్ క్రికెటర్ ఎంఎల్ జయసింహ (కోల్‌కతాలో ఆస్ట్రేలియాపై 1960లో); రవిశాస్త్రి (కోల్‌కతాలో ఇంగ్లండ్‌పై 1984లో) ఈ ఘనత సాధించడం విశేషం.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 172; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: సమరవిక్రమ (సి) సాహా (బి) భువనేశ్వర్ 23; కరుణరత్నే ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్ 8; తిరిమన్నె (సి) కోహ్లి (బి) ఉమేశ్ 51; మాథ్యూస్ (సి) రాహుల్ (బి) ఉమేశ్ 52; చండిమాల్ (సి) సాహా (బి) షమీ 28; డిక్‌వెలా (సి) కోహ్లి (బి) షమీ 35; షనక ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్ 0; పెరీరా (సి) సాహా (బి) షమీ 5; హెరాత్ (సి) షమీ (బి) భువనేశ్వర్ 67; లక్మల్ (బి) షమీ 16; గమగే నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (83.4 ఓవర్లలో ఆలౌట్) 294.
వికెట్ల పతనం:
1–29, 2–34, 3–133, 4–138, 5–200, 6–201, 7–201, 8–244, 9–290, 10–294. బౌలింగ్: భువనేశ్వర్ 27–5–88–4, షమీ 26.3–5–100–4, ఉమేశ్ 20–1–79–2, అశ్విన్ 8–2–13–0, జడేజా 1–0–1–0, కోహ్లి 1.1–0–5–0.
భారత్ రెండో ఇన్నింగ్స్:
రాహుల్ బ్యాటింగ్ 73; ధావన్ (సి) డిక్‌వెలా (బి) షనక 94; పుజారా బ్యాటింగ్ 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 171.
వికెట్ల పతనం:
1–166. బౌలింగ్: లక్మల్ 8–0–29–0, గమగే 9–0–47–0, షనక 9.3–1–29–1, పెరీరా 10–1–41–0, హెరాత్ 3–0–25–0.