విజయాన్ని వదిలేశారు
♦ నాలుగో వన్డేలో భారత్ ఓటమి
♦ 178 పరుగులకు ఆలౌట్
♦ జట్టును గట్టెక్కించని ధోని
♦ విండీస్‌ను గెలిపించిన కెప్టెన్ హోల్డర్
భారత్ విజయలక్ష్యం కేవలం 190 పరుగులు.. స్టార్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్‌కు ఇదో లెక్కా.. అనే అంతా భావించారు. కానీ జరిగింది వేరు. కచ్చితంగా ఈ మ్యాచ్‌తో సిరీస్ గెలుస్తారని భావించిన కోహ్లి సేనకు బలహీన వెస్టిండీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): ఎంఎస్ ధోని (114 బంతుల్లో 54; 1 ఫోర్) క్రీజులో ఉన్నంతసేపు భారత జట్టు విజయంపై ఎవరికీ అనుమానం లేకున్నా... అతను మరో ఓవర్ మిగిలి ఉండగానే అవుట్ కావడంతో నాలుగో వన్డేలో భారత్ పరిస్థితి తారుమారైంది. చివరి 2 ఓవర్లలో 16 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసిన టీమిండియా ఆఖరి మూడు వికెట్లను కోల్పోయింది. మొత్తంగా పేసర్ జేసన్ హోల్డర్ (5/27) ధాటికి కకావికలమైన భారత్ 49.4 ఓవర్లలో 178 పరుగులకు కుప్పకూలింది.
ఫలితంగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో కోహ్లి బృందం విజయం సాధించాల్సిన చోట 11 పరుగులు తేడాతో పరాజయం పాలైంది. ఓవరాల్‌గా నత్తతో పోటీపడిన బ్యాటింగ్ భారత్‌కు అవమానకర ఓటమి తెచ్చిపెట్టినట్టయ్యింది. రహానే (91 బంతుల్లో 60; 7 ఫోర్లు) తన ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. ప్రస్తుతం ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2–1కి తగ్గింది. ఇక సిరీస్ వశం చేసుకోవాలంటే గురువారం కింగ్‌స్టన్‌లో జరిగే ఆఖరి వన్డేలో భారత్ కచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి ఉంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విండీస్ కెప్టెన్ హోల్డర్‌కి దక్కింది.
47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను రహానే, ధోని ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. ధోని 108 బంతులు ఆడి అర్ధ సెంచరీ చేశాడు. అతను సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచినా చివర్లో జట్టు విజయానికి ఉపయోగపడలేకపోయాడు. భారత్‌కు ఆఖరి 30 బంతుల్లో 31 పరుగులు కావాల్సి ఉండగా... క్రీజులో ధోనితో పాటు హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), ఆ తర్వాత జడేజా (11 బంతుల్లో 11; 1 ఫోర్) ఉన్నా ఫలితం దక్కలేదు. 21 నుంచి 40వ ఓవర్ మధ్యలో కేవలం ఒక్క ఫోర్ మాత్రమే నమోదు కావడం విండీస్ బౌలర్ల ప్రదర్శన స్థాయిని చెబుతుంది. 49వ ఓవర్ చివరి బంతికి ధోనిని విలియమ్స్ అవుట్ చేశాడు. ఇక భారత్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరం అయ్యాయి. హోల్డర్ నాలుగు బంతుల వ్యవధిలో ఉమేశ్ యాదవ్, షమీలను అవుట్ చేసి భారత్ ఓటమిని ఖాయం చేశాడు.
స్కోరు వివరాలు
విండీస్ ఇన్నింగ్స్: 189/9; భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) షాయ్ హోప్ (బి) బిషూ 60; ధావన్ (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 5; కోహ్లి (సి) షాయ్ హోప్ (బి) హోల్డర్ 3; దినేశ్ కార్తీక్ (సి) షాయ్ హోప్ (బి) జోసెఫ్ 2; ధోని (సి) జోసెఫ్ (బి) విలియమ్స్ 54; జాదవ్ (సి) షాయ్ హోప్ (బి) నర్స్ 10; పాండ్యా (బి) హోల్డర్ 20; జడేజా (సి) పావెల్ (బి) హోల్డర్ 11; కుల్దీప్ నాటౌట్ 2; ఉమేశ్ (బి) హోల్డర్ 0; షమీ (సి) చేజ్ (బి) హోల్డర్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 178.
వికెట్ల పతనం: 1–10, 2–25, 3–47, 4–101, 5–116, 6–159, 7–173, 8–176, 9–176, 10–178.
బౌలింగ్: జోసెఫ్ 9–2–46–2; హోల్డర్ 9.4–2–27–5; విలియమ్స్ 10–0–29–1; బిషూ 10–1–31–1; నర్స్ 10–0–29–1; చేజ్ 1–0–16–0.
ఓటమికి బ్యాట్స్‌మెన్ కారణం...
పిచ్ చాలా నెమ్మదిగా ఉండటంతో షాట్లు ఆడటం బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా మారింది. అంతమాత్రాన ఈ ఓటమిని తేలిగ్గా తీసుకోలేము. నిజానికి మన ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. లక్ష్యం సాధించదగ్గదే. జట్టు ఓటమికి బ్యాట్స్‌మెన్ కారణమని అనుకుంటున్నాను. మూడు వన్డేల్లోనూ తొలి పది ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయాం. అయినా 260 పరుగులను సాధించగలిగాం. పరిస్థితులకు తగ్గట్టుగా ధోని బ్యాటింగ్ చేశాడు.
– బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్
షాట్ల ఎంపికలో లోపం ఉంది...
షాట్ల ఎంపిక మా స్థాయికి తగ్గట్టుగా లేదు. కీలక సమయంలో వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. విండీస్ బౌలర్లు మా లయను దెబ్బతీశారు. మా బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగ్గా ఉండటంతో వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగాం. అయితే బ్యాటింగ్‌లో లోపం కారణంగా ఫలితం దక్కలేదు. ఇక ఈ ఓటమిని మరిచి చివరి మ్యాచ్‌కు
సిద్ధమవుతాం.
– భారత కెప్టెన్ విరాట్ కోహ్లి
3 ద్వైపాక్షిక సిరీస్‌లో వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రహానే. గతంలో సచిన్, సెహ్వాగ్ ఈ జాబితాలో ఉన్నారు.
2 సదగోపన్ రమేశ్ (116 బంతులు; కెన్యాపై 1999లో) తర్వాత భారత్ తరఫున ఎక్కువ బంతులు (108) ఆడి అర్ధ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్ ధోని.