'హార్దిక' విజయం | india win by 26 runs | Sakshi
Sakshi News home page

'హార్దిక' విజయం

Published Mon, Sep 18 2017 12:31 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

'హార్దిక' విజయం

'హార్దిక' విజయం

తొలి వన్డేలో భారత్‌ జయభేరి
పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌ రాణించిన ధోని
భారత బౌలర్ల జోరు


హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ జోరు... ధోని సమయోచిత ప్రదర్శన... బౌలర్ల సమష్టి కృషి వెరసి భారత్‌కు ఆస్ట్రేలియాపై శుభారంభాన్ని అందించాయి. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా... పాండ్యా, ధోని జోడి ముందుగా మన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందిస్తే... ఆ తర్వాత చహల్, కుల్దీప్‌ మణికట్టు మాయాజాలం కంగారూలను కట్టి పడేసింది. మరో పది నిమిషాల పాటు వర్షం పడితే మ్యాచ్‌ రద్దయ్యే స్థితి నుంచి చివరకు విజయం భారత్‌ వైపు నిలిచింది. టి20 తరహా ఇన్నింగ్స్‌ ఆడేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ పేలవ బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది.

చెన్నై:
శ్రీలంకపై సూపర్‌ ప్రదర్శన తర్వాత అదే జోరును సొంతగడ్డపై కూడా భారత్‌ కొనసాగించింది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి విజయంతో సత్తా చాటింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్‌ 26 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం) ఆసీస్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఎమ్మెస్‌ ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. అనంతరం భారీ వర్షం కారణంగా సుదీర్ఘ సమయం పాటు మ్యాచ్‌ ఆగిపోయింది. ఎట్టకేలకు వాన ఆగిన తర్వాత ఆసీస్‌ విజయ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్దేశించారు. ఆ జట్టు చివరకు 21 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా...చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే గురువారం కోల్‌కతాలో జరుగుతుంది.  

కూల్టర్‌ నీల్‌ జోరు...
11 పరుగులకు 3 వికెట్లు... చిదంబరం స్టేడియంలోని పిచ్‌ ఆరంభంలో బౌన్స్‌కు అనుకూలించడంతో భారత్‌ పరిస్థితి ఇది. ఆసీస్‌ పేసర్లు కమిన్స్, కూల్టర్‌ నీల్‌ తమ పదునైన బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా నిరోధించగలిగారు. ముఖ్యంగా కూల్టర్‌ నీల్‌ బంతులను అంచనా వేయడంలో పొరబడిన తొలి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ డ్రైవ్‌లు ఆడబోయి అవుటయ్యారు. ముందుగా రహానే (5) కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా...ఆ తర్వాత బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో మ్యాక్స్‌వెల్‌ అద్భుత క్యాచ్‌కు కోహ్లి (0) డకౌటయ్యాడు. రెండు బంతుల అనంతరం మనీశ్‌ పాండే (0) కూడా కెప్టెన్‌ను అనుసరించాడు. అంతకుముందే 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్‌లో స్మిత్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 28; 3 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌ (54 బంతుల్లో 40; 5 ఫోర్లు) కలిసి ఈ దశలో పరిస్థితిని చక్క దిద్దే ప్రయత్నం చేశారు. నెమ్మదిగా ఆడుతూ వచ్చిన రోహిత్‌ చివరకు భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ స్క్వేర్‌లెగ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. కేదార్‌ కూడా కొద్ది సేపటికి పెవిలియన్‌ చేరడంతో భారత్‌ స్కోరు 87/5 వద్ద నిలిచింది.  

కీలక భాగస్వామ్యం...
వరుస వికెట్లు పడిన తర్వాత జట్టును ఆదుకోవాల్సిన బాధ్యతను సీనియర్‌ ధోని, జూనియర్‌ పాండ్యా తీసుకున్నారు. ఈ ప్రయత్నంలో మధ్యలో కొద్దిసేపు పెద్దగా పరుగులే రాలేదు. అనంతరం పాండ్యా దూకుడుగా చెలరేగిపోగా, మరో ఎండ్‌లో ధోని ఓపిగ్గా, ప్రశాంతంగా ఆడే ప్రయత్నం చేశాడు. కూల్టర్‌ నీల్‌ బౌలింగ్‌లో 13 పరుగుల వద్ద పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో స్మిత్‌ వదిలేయడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా జంపా బౌలింగ్‌ను చితక్కొట్టిన పాండ్యా, ఈ క్రమంలో 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు జంపా బౌలింగ్‌లో పాండ్యా వెనుదిరగడంతో 118 పరుగుల ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత ధోని వంతు వచ్చింది. తన తొలి 66 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకుండా 40 పరుగులు చేసిన ధోని...ఆ తర్వాత ఆడిన 22 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. 75 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్న ధోని...ఫాల్క్‌నర్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగాడు. మరోవైపు నుంచి భువనేశ్వర్‌ (30 బంతుల్లో 32 నాటౌట్‌; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంతో భారత్‌ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది.  

మ్యాక్సీ మినహా...
టి20 తరహా లక్ష్య ఛేదనలో హిట్టర్లు ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు మంచి విజయావకాశాలు కనిపించాయి. అయితే కార్ట్‌రైట్‌ (1)ను బుమ్రా బౌల్డ్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించిన తర్వాత ఆ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగినట్లు కనిపించలేదు. వార్నర్‌ (28 బంతుల్లో 25; 2 ఫోర్లు) తన సహజశైలికి భిన్నంగా ఆడటం ఆ జట్టుకు ఉపయోగపడకపోగా...స్మిత్‌ (1), హెడ్‌ (5), స్టొయినిస్‌ (3), వేడ్‌ (9) వరుస కట్టి విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌లో ఒక దశలో మ్యాక్స్‌వెల్‌ మెరుపు బ్యాటింగ్‌ మాత్రం ఆసీస్‌ విజయంపై ఆశలు రేపింది. కుల్దీప్‌ వేసిన ఓవర్లో అతను 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 22 పరుగులు రాబట్టాడు. అయితే అదే జోరులో మ్యాక్స్‌వెల్‌ డీప్‌లో క్యాచ్‌ ఇచ్చి అవుటైన తర్వాత కం గారూలు కోలుకోలేకపోయారు. చివర్లో ఫా ల్క్‌నర్‌ (25 బంతుల్లో 32 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) పోరాడినా లాభం లేకపోయింది.  

పాండ్యా మెరుపులు
ఆసీస్‌ లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా వేసిన 37వ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా విశ్వరూపం ప్రదర్శించాడు. రెండో బంతిని ఫోర్‌గా మలచిన అతను తర్వాతి మూడు బంతులను వరుసగా 6, 6, 6 కొట్టాడు. ఇందులో రెండో సిక్సర్‌ స్టేడియం పైకప్పును తాకింది. ఈ ఓవర్లో భారత్‌కు మొత్తం 24 పరుగులు లభించాయి. ‘హ్యాట్రిక్‌’ సిక్సర్లు కొట్టడం పాండ్యా స్వల్ప అంతర్జాతీయ కెరీర్‌లో ఇది నాలుగోసారి కావడం విశేషం. చాంపియన్స్‌ ట్రోఫీలో రెండు సార్లు పాక్‌పై, ఆ తర్వాత శ్రీలంకపై టెస్టు మ్యాచ్‌లో అతను ఈ ఫీట్‌ ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ కూడా కుల్దీప్‌ బౌలింగ్‌లో సరిగ్గా ఇదే తరహాలో వరుసగా 4, 6, 6, 6తో చెలరేగడం యాదృచ్ఛికం.  

100 మూడు ఫార్మాట్‌లు కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని  అర్ధసెంచరీల సంఖ్య. ధోని టెస్టుల్లో 33, వన్డేల్లో 66, టి20ల్లో ఒక అర్ధ సెంచరీ సాధించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement