
మెల్‌బోర్న్: ఆంధ్ర యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారి ఓపెనర్‌గా విఫలమైతే మిడిలార్డర్‌లో మరిన్ని అవకాశాలిస్తామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. వికెట్ కీపర్లు రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లకు తగినన్ని టి20 అవకాశాలు ఇచ్చేందుకే ధోనికి విశ్రాంతి కల్పించామని ఆయన వివరించారు. దీంతో కుర్రాళ్లను పరిశీలిస్తున్నామని చెప్పకనే చెప్పిన ఈ చీఫ్ సెలక్టర్ ఆసీస్‌లో 2020లో జరిగే టి20 ప్రపంచకప్‌లో ధోని ఆడడనే సంకేతాలిచ్చాడు. రవీంద్ర జడేజాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేసే సమయంలో అతను ఫిట్‌నెస్‌తోనే ఉన్నట్లు చెప్పాడు.
రెగ్యులర్ ఓపెనర్లు రాహుల్, విజయ్ పదేపదే నిరాశపర్చడంతో టీమ్ మెనేజ్‌మెంట్ విహారి, మయాంక్ అగర్వాల్‌లతో ‘బాక్సింగ్ డే’ టెస్టును ఓపెన్ చేయించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండే టెస్టులాడిన విహారి విఫలమైతే పరిస్థితి ఏంటని ప్రశ్నకు సమాధానమిస్తూ ‘విఫలమైనా అవకాశాలు సజీవంగా ఉంటాయి. దేశవాళీ క్రికెట్‌లో అతని ఆటను ప్రత్యక్షంగా గమనించా. కూకాబురా బంతుల్ని ఎదుర్కొనే సత్తా అతనిలో ఉంది’ అని అన్నాడు. 1999 పర్యటనలో మెల్‌బోర్న్‌లో ఎమ్మెస్కే కూడా ఓపెనర్‌గా దిగినా... స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ ధాటికి నిలువలేకపోయాడు. దీనిపై అతను మాట్లాడుతూ అవకాశాల్ని అంచనాల్ని తాను అందుకోలేకపోయానని కానీ ఈ యువ ద్వయం (విహారి, మయాంక్) రాణిస్తారనే ధీమా వ్యక్తం చేశాడు.