మెరుగైన ఆటతో ఓడిస్తాం: వేడ్
రాంచీ: రెండో టెస్టులో నెగ్గి దూకుడు మీదున్న భారత జట్టుపై మూడో టెస్టులో మరింత మెరుగైన ఆటతీరుతో రాణిస్తామని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అన్నాడు. అయితే తొలి టెస్టులో దారుణంగా ఓడిన అనంతరం రెండో టెస్టుకు టీమిండియాలో అనూహ్య మార్పు వచ్చిందని చెప్పాడు. ‘రెండో టెస్టుకు భారత క్రికెటర్లలో వచ్చిన మార్పు మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. మూడో రోజు కసిగా బ్యాటింగ్ చేశారు. మేమది ఊహించాము. నిజానికి భారత జట్టు ఎప్పుడూ దూకుడుగానే ఆడుతుంది.
కోహ్లితో పోలిస్తే ధోని కెప్టెన్సీ విభిన్నంగా ఉంటుంది. అయితే ఈ తేడా వారిద్దరి వ్యక్తి్తత్వం వల్లే వచ్చింది. ఇక మూడో టెస్టులో మేం నైపుణ్యంతో కూడిన క్రికెట్ ఆడి దెబ్బకొడతాం’ అని వేడ్ అన్నాడు. బరిలోకి దిగాక అత్యుత్తమ ఆటతీరును చూపేందుకు ప్రయత్నిస్తానని 29 ఏళ్ల వేడ్ చెప్పాడు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ఈనెల 16న రాంచీలో ప్రారంభమవుతుంది.