కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. శనివారం జరిగిన ఐదవ టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. అయిదు టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్, టీ 20 సిరీస్‌లను దక్షిణాఫ్రికా గడ్డపై సాధించిన మొదటి భారత మహిళా జట్టుగా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఓపెనర్ మిథాలీ రాజ్ 62 పరుగులతో చెలరేగింది. 50 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లతో అద్భుతంగా ఆడింది. స్మృతి మంధాన మరోసారి నిరాశపరిచింది. తొలి వికెట్‌కు ఇద్దరు 32 పరుగుల భాగస్వామ్యం అందించారు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మృతి వెనుదిరిగింది. అనంతరం రంగంలోకి దిగిన రోడ్రిగస్ మిథాలితో కలిసి స్కోరును ముందుకు కదిలించింది. 34 బంతుల్లో (మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) 44 పరుగులు చేసింది. చివరలో రెండు వికెట్లను స్వల్ప వ్యవధిలో చేజార్చుకోవడంతో 166 పరుగులు చేయగలిగింది.
167పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా ఏదశలోను భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ సేన 18 ఓవర్లలో112 పరుగులకు ఆలౌట్ అయింది. కాప్ 27 పరుగులు, ట్రైయాన్ 25 పరుగులతో రాణించగా మిగతా వారు చేతులెత్తేశారు. భారత బౌలర్లలో శిఖా పాండే, థార్, గైక్వాడ్‌లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టారు. ఒక్కొక్కరు మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా వెన్ను విరిచి విజయంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment