Ind Vs SA 4th T20 At Rajkot: Weather And Pitch Report, Predicted Playing XI, Other Details - Sakshi
Sakshi News home page

IND Vs SA 4th T20 Details: సిరీస్‌ సమం చేసేందుకు...

Published Fri, Jun 17 2022 5:27 AM | Last Updated on Fri, Jun 17 2022 10:45 AM

Ind vs SA 4th T20: Fourth T20  India against South Africa at Rajkot - Sakshi

రాజ్‌కోట్‌: మారింది... ఒక్క విజయంతో సిరీస్‌ సీన్‌ మారింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. రాజ్‌కోట్‌ మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ 2–2తో సమం అవుతుంది. అప్పుడే లక్ష్యం దిశగా భారత జట్టు అడుగు వేస్తుంది. ఈ సిరీస్‌లో... సీనియర్లు లేని టీమిండియా తొలుత డీలా పడినా గత మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో... ఇటు బౌలింగ్‌తో గర్జించింది. ఇప్పుడిదే ఉత్సాహంతో సిరీస్‌ సమం చేసేందుకు సన్నద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టి20 మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా రిషభ్‌ పంత్‌ సేన బరిలోకి దిగుతోంది. అయితే మరో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో భారత కోచ్‌ ద్రవిడ్‌ కుర్రాళ్లతో కూడిన జట్టును పట్టుదలతో సిద్ధం చేస్తున్నాడు.  

బ్యాటింగ్‌ బాగున్నప్పటికీ...
వైజాగ్‌ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్‌లే మెరిపించారు. తర్వాత వచ్చిన వారంతా నిరాశపరిచారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్, కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ల నుంచి మ్యాచ్‌ను మలుపుతిప్పే ఇన్నింగ్సే కరువైంది. హార్దిక్‌ పాండ్యా కాస్త మెరుగనిపించినప్పటికీ మెరుపులు మాత్రం తక్కువే! ఈ కోవలో దినేశ్‌ కార్తీక్‌కు మినహాయింపేమీ లేదు. వీళ్లంతా ఓపెనర్ల కంటే సీనియర్లు... కానీ బాధ్యత పంచుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు.

కీలకమైన నేటి మ్యాచ్‌లో సీనియర్లంతా ఆడితేనే పటిష్టమైన దక్షిణాఫ్రికాకు బదులివ్వగలం. లేదంటే బెంగళూరు (ఆఖరి మ్యాచ్‌)కు వెళ్లకముందే ఇక్కడే సిరీస్‌ను ప్రత్యర్థి జట్టు చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. తొలి టి20తో పోల్చితే గత రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ విభాగం మెరుగైంది. సీమర్లు భువనేశ్వర్, హర్షల్‌ పటేల్, స్పిన్నర్‌ చహల్‌ ప్రత్యర్థి బ్యాటర్స్‌ను చక్కగా కట్టడి చేస్తున్నారు. ఇదే నిలకడ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగితే భారత్‌ విజయానికి బాట పడుతుంది.

సిరీస్‌ లక్ష్యంగా సఫారీ
ఇక్కడ టీమిండియా లక్ష్యం మ్యాచ్‌ అయితే... పర్యాటక జట్టు సిరీసే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పైగా సీనియర్, డాషింగ్‌ ఓపెనర్‌ డికాక్‌ కూడా అందుబాటులోకి రావడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చే అంశం. బవుమా, డికాక్‌ జోడీ ఓపెనింగ్‌లో చెలరేగితే... డసెన్, క్లాసెన్, మిల్లర్‌లతో కూడిన మిడిలార్డర్‌ మిగతా పరుగుల సంగతి చూసుకుంటుంది. సఫారీ నెగ్గిన రెండు టి20లను పరిశీలిస్తే మిడిలార్డర్‌ పాత్రే కీలకంగా నిలిపింది. రాజ్‌కోట్‌ పిచ్‌పై పరుగులు ధారాళంగా రావడం ఖాయం. ఈ నేపథ్యంలో క్లాసెన్, మిల్లర్‌లు నిలదొక్కుకుంటే భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. ఇక బౌలింగ్‌ విషయంలో దక్షిణాఫ్రికాకు ఏ బెంగా లేదు. తొలి మ్యాచ్‌ మినహా... సీమర్లు నోర్జే, పార్నెల్, రబడ, స్పిన్నర్లు కేశవ్‌ మహరాజ్, షమ్సీలు భారత వికెట్లపై అద్భుతంగా రాణిస్తున్నారు. సఫారీ మళ్లీ సమష్టిగా కదం తొక్కితే భారత్‌కు కష్టాలు తప్పవు. ఆఖరి మ్యాచ్‌ దాకా లాగకుండా ఇక్కడే సిరీస్‌ను నెగ్గినా ఆశ్చర్యం లేదు.

పిచ్‌–వాతావరణం
ఈ వికెట్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. పరుగుల విందు ఖాయం. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపుతుంది. రుతుపవనాలతో వాతావరణం కాస్త చల్లబడింది. అయితే వర్షం పడే అవకాశాలు తక్కువే!  

జట్లు (అంచనా)
భారత్‌: రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్, అక్షర్, హర్షల్, అవేశ్‌ ఖాన్, భువనేశ్వర్, చహల్‌.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), డికాక్, వాన్‌ డెర్‌ డసెన్,  మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, కేశవ్, నోర్జే, షమ్సీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement