రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టి-20 మ్యాచ్ యువరాజ్ విజృంభణతో భారత్ వశమైంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ కాస్తా యువీ వీరకొట్టుడుతో భారత్ ఖాతాలో పడింది. చాలాకాలం తర్వాత మళ్లీ టి-20 మ్యాచ్ ఆడిన యువరాజ్.. కెరీర్ లోనే అత్యధిక స్కోర్ సాధించి ఒంటిచేత్తో టీమిండియాకు విజయం అందించాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఆసీస్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే కష్టాల్లో పడింది. అప్పటివరకూ భారత్ పని అయిపోయిందనుకుంటున్న ప్రేక్షకుల్లో.. యువరాజ్ సింగ్ రంగప్రవేశంతో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలెత్తింది. యువరాజ్ 35 బంతుల్లో (8 ఫోర్లు, 5 సిక్స్‌లు) 75 పరుగులు చేశాడు.
భారత్ ఓపెనర్ శర్మ 8 బంతుల్లో (1సిక్స్)తో 8 పరుగులు చేసి చేతులెత్తేశాడు. పోటుగాడు శిఖర్ ధావన్ కూడా 19 బంతుల్లో (5 ఫోర్లు) 32 పరుగులు చేసి దోహర్తీ బౌలింగ్‌లో కుప్పకూలిపోయాడు. తరువాత వచ్చిన సురేష్ రైనా 19 పరుగులకే ఔటై అభిమానులను నిరాశపరిశాడు. విరాట్ కోహ్లీ (29) జోరుగా ఆడటంతో భారత్‌కు కొంత ఊరట కలిగినట్టయింది. అంతలోనే సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ వద్ద కోహ్లీ దొరికేశాడు. సరిగ్గా ఆప్పుడే యువరాజ్ సింగ్ బరిలోకి దిగాడు. చెత్తబంతి దొరకడమే పాపం, సిక్సులు, ఫోర్లతో స్కోరుబోర్డును పరుగులు తీయించాడు. చక్కని ఇన్నింగ్ ఆడి యువరాజ్ సింగ్ (77) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతనికి భాగస్వామ్యాన్ని అందించిన భారత్ కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో (24) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, ఆసీస్ బౌలర్లు మెకే 2 వికెట్లు తీయగా, కౌల్టర్ నైలి, దొహర్టీ తలో వికెట్ తీసుకున్నారు.
అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ ఫించ్ 89 పరుగులు చేసి ఔరా అనిపించాడు. మిడ్డిన్ సన్ (34) పరుగులు చేశాడు. ఫించ్ మంచి ఆటతీరును ప్రదర్శించడంతో అతన్ని పెవిలీయన్ పంపేందుకు భారత్ బౌలర్ల ప్రయత్నాలను తిప్పికొడుతూ ముచ్చెటములు పట్టించాడు. భారత్ బౌలర్ ప్రవీణ్‌కుమార్ చక్కని బంతి వేయడంతో ఫించ్‌కు కాస్తా పంచ్ పడినట్టైంది.