భారత్ 5, కివీస్ 0..
ఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలుత ఫీల్డింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపాడు. గత వన్డేలో గెలిచిన భారత్.. అదే ఫలితాన్నిపునరావృతం చేయాలని భావిస్తుండగా, భారత పర్యటనలో బోణి కొట్టాలని న్యూజిలాండ్ యోచిస్తోంది.
ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, న్యూజిలాండ్ జట్టు మూడు మార్పులు చేసింది. గత మ్యాచ్ లో ఆడిన నీషమ్, బ్రాస్ వెల్, సోధీలకు విశ్రాంతి నిచ్చి, వారి స్థానంలో బౌల్ట్, హెన్రీ, డెవిచిచ్ లను తుది జట్టులోకి తీసుకుంది. ఇదిలా ఉండగా, ఈ సుదీర్ఘ సిరీస్ లో భారత్ ఇప్పటివరకూ టాస్ ఓడలేదు. అంతకుముందు జరిగిన మూడు టెస్టుల సిరీస్ తో పాటు, ఈ రెండు వన్డేల్లోనూ భారత్ టాస్ గెలవగా, న్యూజిలాండ్ కు ఇంకా టాస్ విషయంలో కూడా అదృష్టం కలిసి రాలేదు.
భారత తుది జట్టు:ఎంఎస్ ధోని(కెప్టెన్), విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, మన్ దీప్ సింగ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రోహిత్ శర్మ, కేదర్ జాదవ్, ఉమేష్ యాదవ్, బుమ్రా
న్యూజిలాండ్ తుది జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), కోరీ అండర్సన్, గప్టిల్, టామ్ లాధమ్, ల్యూక్ రోంచీ, సౌతీ, రాస్ టేలర్, సాంట్నార్, బౌల్ట్, హెన్రీ, డెవిచిచ్