న్యూఢిల్లీ: గత ఏడాది బ్యాడ్మింటన్ అభిమానులను ఆకట్టుకున్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్ (2014) మాత్రం నిర్వహించనే లేదు. దాంతో ఈ టోర్నీ ఇకపై సాగుతుందా, లేదా అనే సందేహాలు వినిపించాయి. అయితే వచ్చే సంవత్సరం ఐబీఎల్ జరపనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఏప్రిల్ 12నుంచి మే 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో, ఫైనల్ మ్యాచ్ ముంబైలో నిర్వహిస్తారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా, టోర్నీ హక్కులు ఉన్న స్పోర్టీ సొల్యూషన్స్ మధ్య విభేదాలతోనే ఈ సంవత్సరం టోర్నీ జరగలేదు.
స్పోర్టీనుంచి గ్యారంటీ మనీగా రూ. 50 కోట్లు గుప్తా డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరకు గత వారం కేంద్ర క్రీడా మంత్రి సోనోవాల్ జోక్యంతో సమస్య పరిష్కారమైంది. మరో వైపు ఢిల్లీ, ముంబై జట్ల ఫ్రాంచైజీలు కూడా మారిపోయారు. గవాస్కర్, నాగార్జున, చాముండిలకు చెందిన ముంబై జట్టును వారు మరో సంస్థకు అమ్మేశారు. ఢిల్లీ జట్టు తమ ఆటగాళ్లకు చెల్లింపులు జరపడంలో విఫలం కావడంతో ఆ ఫ్రాంచైజీని రద్దు చేసి మరొకరికి ఇచ్చినట్లు సమాచారం.
ఏప్రిల్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్
Published Wed, Dec 3 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement